టీఆర్ఎస్ లో ఎవ‌రూ సంతృప్తిగా లేరు..టైమ్ కోసం చూస్తున్నారు

Update: 2021-11-18 14:42 GMT

యుద్ధం కాదు..కెసీఆర్ ప‌త‌న‌మే మొద‌లైంది

ఈటెల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ధాన్యం సేక‌ర‌ణ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రికి నిర‌స‌న‌గా ముఖ్య‌మంత్రి కెసీఆర్ తోపాటు తెలంగాణ మంత్రులు...ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గురువారం మ‌హా ధ‌ర్నాకు దిగిన విష‌యం తెలిసిందే. ధ‌ర్నాలో మాట్లాడిన సీఎం కెసీఆర్ బిజెపిపై యుద్దం మొద‌లైంద‌ని..ఇది ప్రారంభం మాత్ర‌మే అని వ్యాఖ్యానించారు. కెసీఆర్ వ్యాఖ్య‌ల‌కు మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేంద‌ర్ కౌంట‌ర్ ఇచ్చారు. ప్రారంభం అయింది యుద్దం కాద‌ని..కెసీఆర్ ప‌త‌నం అంటూ స్పందించారు. త‌న‌కే అన్నీ తెలుసు...తానే అన్నీ చేయ‌గ‌ల‌ను అన్న అహంకార ధోర‌ణితో కెసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విమ‌ర్శించారు. కెసీఆర్ నిర్వాకం వ‌ల్లే తెలంగాణ రైతాంగం ఇప్పుడు నానా అగ‌చాట్లు ప‌డుతోంద‌న్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌కు వేల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టిన కెసీఆర్..రైతుల కోసం ఈ మాత్రం ఖ‌ర్చు చేయ‌లేరా? అని ప్ర‌శ్నించారు. గ‌తంలో ఉన్న ప్ర‌భుత్వాలు ఏదైనా స‌మ‌స్య వ‌స్తే రాష్ట్రంలోని ప్ర‌తిప‌క్ష పార్టీల‌తో మాట్లాడి స‌మ‌స్య‌ల ప‌రిష్క‌రానికి చ‌ర్య‌లు తీసుకునేవ‌ని..ఇప్పుడు ఆస‌లు ఆ ప‌ద్ద‌తే లేకుండా పోయింద‌న్నారు. కెసీఆర్ త‌న కీర్తి కోసం త‌ప్ప‌..రైతుల కోసం ప‌నిచేయ‌టం లేద‌న్నారు. ఆయ‌న రైతు బంధు కాద‌ని..రైతు ద్వేషి అని ఆరోపించారు. ఒక్క రైతు బంధు ఇచ్చి రైతుల‌కు అందాల్సిన ఇత‌ర అన్ని కార్య‌క్ర‌మాలు ఆపేశార‌ని త‌ప్పుప‌ట్టారు.

ధ‌ర్నా చౌక్ వ‌ద్ద‌ని నిర్ణ‌యం తీసుకున్న కెసీఆర్..అక్క‌డ ధ‌ర్నాకు కూర్చోవ‌టానికి సిగ్గుండాలి అంటూ మండిప‌డ్డారు. ధర్నాచౌక్ నుంచే సీఎం కేసీఆర్ పతనం ఆరంభమైందన్నారు. తన ముఖం అసెంబ్లీలో చూడకూడదనుకుంటే సీఎం‌ రాజీనామా చేయాలన్నారు. టీఆర్ఎస్‌లో ఏ ఒక్క నేత సంతృప్తిగా లేడని, సమయం కోసం వేచి చూస్తున్నారన్నారు. కేసీఅర్ తీరును ప్రజాస్వామ్యం అసహ్యించుకుంటోందన్నారు. వరి వేస్తే ఉరే అని మాట్లాడటం దుర్మార్గం, మూర్ఖత్వమన్నారు. ప్రతి గింజను రాష్ట్రమే కొంటుందని నిండు సభలో కేసీఆర్ చెప్పలేదా అని ఆయన ప్రశ్నించారు. అప్పుడు ఫోజులు కొట్టి ఇప్పుడు నెపాన్ని కేంద్రంపై నెట్టాల‌ని చూస్తున్నార‌న్నారు. కేంద్రం బాయిల్డ్ రైస్ కొనుగోలును నిలిపివేస్తుంద‌ని మిల్ల‌ర్లు, రైతు సంఘాలు చెప్పాయ‌ని..కానీ వీరి సూచ‌న‌ల‌ను కెసీఆర్ ఏ మాత్రం ప‌ట్టించుకోలేద‌న్నారు. కెసీఆర్ అనాలోచిత నిర్ణ‌యాల వ‌ల్లే రాష్ట్రం అస్త‌వ్య‌స్థంగా త‌యారైంద‌న్నారు.

Tags:    

Similar News