ఏపీలో పంచాయతీ ఎన్నికల వ్యవహారం పూటకో కొత్త మలుపు తిరుగుతోంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాతీయ ఎన్నికలకు ఏకపక్షంగా షెడ్యూల్ జారీ చేశారని సర్కారు ఆరోపిస్తోంది. ఎస్ఈసీ రమేష్ కుమార్ మాత్రం ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని.. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎన్నికల నిర్వహిస్తామని చెబుతున్నారు. ఈ తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినందున కమిషన్ లో పనిచేసే వారు ఎవరూ సెలవులు పెట్టడానికి వీల్లేదని ఆదేశాలు ఉన్నాయి.
అయినా సరే ఎస్ఈసీలో కీలక విధులు నిర్వహిస్తున్న జాయింట్ డైరక్టర్ జీ వీ సాయిప్రసాద్ నెల రోజుల పాటు సెలవుపెట్టి వెళ్ళారు. అంతే కాదు..ఆయన ఎస్ఈసీలోని మరికొంత మంది ఉద్యోగులను కూడా సెలవు పెట్టేలా ప్రోత్సహించారనే కారణంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ఈసీ జెడీ సాయిప్రసాద్ ని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. సాయి ప్రసాద్ ఇతర ప్రభుత్వ సర్వీసుల్లో కూడా చేరటానికి వీల్లేదని తన ఆదేశాల్లో పేర్కొన్నారు. అంతే కాదు..ఆయనకు టెర్మినిల్ బెనిఫిట్స్ పొందటానికి కూడా అర్హుడు కాడు అంటూ ఆదేశించారు. సాయిప్రసాద్ తోపాటు మరికొంత మంది కూడా సెలవు పెట్టినట్లు సమాచారం.