కేంద్ర వ్యవసాయ శాఖ నరేంద్రసింగ్ తోమర్ వ్యవసాయ చట్టాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ చట్టాల విషయంలో తాము ఒక అడుగు వెనక్కి వేశామని..కానీ మళ్ళీ ముందడుగు వేస్తామన్నారు. ఎందుకంటే రైతులే దేశానికి వెన్నెముక అని..వారి ఎంత శక్తివంతం అయితే..దేశం కూడా అంత శక్తివంతం అవుతుందని వ్యాఖ్యానించారు. చట్టాలను వెనక్కి తీసుకున్న విషయంలో ప్రభుత్వం ఏమీ నిరాశ చెందలేదన్నారు. తోమర్ తాజా వ్యాఖ్యలతో కేంద్రం మార్పులతో మళ్లీ వ్యవసాయ చట్టాలను తెచ్చే ఉద్దేశంతో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. డెబ్బయి ఏళ్లలో ప్రధాని మోడీ సారధ్యంలోని ప్రభుత్వం తీసుకొచ్చిన అతి పెద్ద సంస్కరణ ఈ వ్యవసాయ చట్టాలు అన్నారు. కానీ అవి కొంత మందికి నచ్చలేదని..అందుకే నల్లచట్టాలుగా ప్రచారం చేశారని మండిపడ్డారు. నాగ్‌పూర్‌లో ఆయన తాజాగా జరిగిన అగ్రో విజన్ ఎక్స్‌పోలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక అడుగు వెనక్కి వేశామంటే.. మూడు అడుగులు ముందుకు వేస్తాం. వ్యవసాయ చట్టాల్ని మళ్లీ తెచ్చి తీరుతాం అని ఉద్ఘాటించారాయన.
సిక్కు మత వ్యవస్థాపకుడు గురు నానక్ జయంతి సందర్భంగా.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగిస్తున్న ఆందోళనను ఇక విరమించాలని, ఇళ్లకు తిరిగి వెళ్లాలని రైతులకు విజ్ఞప్తి చేశారు ప్రధాని మోడీ. అంతే కాదు..దేశంలోని రైతులకు ప్రధాని బహిరంగంగా క్షమాపణ కూడా చెప్పారు. సాగు చట్టాల ఉపసంహరణకు కేబినెట్ ఆమోదం తెలపగా.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఆమోదం, వెనువెంటనే సాగు చట్టాల రద్దు బిల్లుపై రాష్ట్రపతి ముద్ర పడింది. ఇప్పుడు తోమర్ చేసిన వ్యాఖ్యలతో కేంద్రం అసలు ఉద్దేశం ఏమిటో ఇప్పుడు స్పష్టం అయిందనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ , పంజాబ్ లతోపాటు త్వరలోనే జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తప్పదని భావించే కేంద్రం ఈ చట్టాలపై వెనక్కి తగ్గిందని అందరూ భావించారు. ఈ తరుణంలో తోమర్ మళ్ళీ వ్యవసాయ చట్టాలను వెనక్కి తెస్తామనే తీరుగా సంకేతాలు ఇవ్వటం ఖచ్చితంగా రాజకీయ ప్రకంపనలు రేపటం ఖాయంగా కన్పిస్తోంది.