తెలుగుదేశం ఎమ్మెల్సీ నారా లోకేష్ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉద్యోగులకు జీతాలు..పెన్షన్లు ఇవ్వటం లేదు కానీ ఇంత కష్ట సమయంలోనూ సాక్షి పేపర్ కు మాత్రం సీఎంఎఫ్ఎస్ నుంచి 16.87 కోట్ల రూపాయలు విడుదల చేస్తారా? అని ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. స మింగ మెతుకులేదు కానీ మీసాలకి సంపెంగ నూనె చందంగా ఉంది ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తీరు. లక్షలాది మంది అవ్వాతాతలకు పింఛన్లు లేవు. రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్ ఖాతాలో పడలేదు. ఒకటో తేదీ జీతాలు ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా రాలేదు. ప్రాణాలు కాపాడే 108 సిబ్బందికి మూడునెలలుగా వేతనాలివ్వలేదు. ఫ్రంట్‌లైన్ వారియర్స్ పారిశుధ్య కార్మికులు తమ పెండింగ్ జీతాలడిగితే అరెస్ట్ చేయించిన జగన్‌రెడ్డి... తన సొంత పేపర్ సాక్షికి సీఎఫ్ఎంఎస్ నుంచి ఈ రోజు 16.87 కోట్లు విడుదల చేశారు.
రెండేళ్ల జగన్ పాలనలో అన్నమో రామచంద్రా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అల్లాడుతుంటే ..తన అక్రమాస్తుల మానసపుత్రిక సాక్షికి ఇప్పటివరకూ రూ.220 కోట్లు యాడ్స్ పేరుతో కట్టబెట్టారు. పీసీబీ దాడులతో ఇతర సిమెంట్ కంపెనీల్ని భయపెట్టి ..తన భార్య భారతి సిమెంటు 228370.14 మెట్రిక్ టన్నులను ఇతర కంపెనీల సిమెంట్ ధర కంటే ఎక్కువ పెట్టి ఏపీ ప్రభుత్వంతో కొనుగోలు చేయించారు. కృష్ణాజలాలు జగన్‌రెడ్డి సరస్వతి పవర్ కంపెనీకి కారుచౌకగా కేటాయించుకున్నారు. పదవులు, నీళ్లు, నిధులు, వైన్-మైన్, ల్యాండ్-శాండ్, జేట్యాక్స్ పేరుతో అన్నీ దోచుకుని ప్రజలకి అప్పులు-తిప్పలు మిగిల్చారు ఏ వన్ జగన్ రెడ్డి గారు!స అంటూ వరస ట్వీట్లు చేశారు.