వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడితో జగన్ నిజంగానే సైకో రెడ్డి అనిపించుకున్నారని ఆయన విమర్శించారు. పెంపుడు కుక్కలను తమపైకి పంపి తాడేపల్లి ఇంటిలో దాక్కున్న వ్యక్తి జగన్ అని ఎద్దేవా చేశారు. నేరుగా వస్తే మాట్లాడదామని, పోరాడదామని లోకేశ్ సవాల్ విసిరారు. ఎవరూ లేని సమయంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేస్తే భయపడతామనుకుంటున్నారా అని లోకేశ్ వ్యాఖ్యానించారు. ''ప్రతిపక్షం అడిగే ప్రశ్నకు దమ్ముంటే సమాధానం చెప్పాలి. లేనిపక్షంలో ఇంటికే పరిమితం కావాలి. ఏపీలో ఎప్పుడూ లేని విధంగా డ్రగ్స్, గంజాయి మాఫియా పెరిగిపోయింది.'' అని లోకేశ్ ఆరోపించారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుకుంటున్నా రాష్ట్రంతో సంబంధాలు ఉంటున్నాయని తెలిపారు.
ప్రభుత్వం చేసే తప్పులపై పోరాడుతున్నామని తెలిపారు. గంజాయి నివారణలో రాష్ట్ర పోలీసులకు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. దాడులు చేసినంత మాత్రాన తాము భయపడబోమని..రాబోయే రోజుల్లో మీ వీపులు పగులుతాయి అని హెచ్చరించారు. తమ అధినేత చంద్రబాబుకు ఉన్నంత సహనం, ఓపిక తనకు లేవన్నారు. బూతులకు కేరాఫ్ అడ్రస్ వైసీపీ యూనివర్శిటీ అని వ్యాఖ్యానించారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ బహిరంగంగా చంద్రబాబు నడిరోడ్డు మీద కాల్చిచంపాలంటూ వ్యాఖ్యానించాలేదా అని ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వారికి సరైన శిక్ష పడేంత వరకూ వదిలిపెట్టబోమన్నారు.