ఏపీ అసెంబ్లీ పరిణామాలపై జనసేన నేత, నటుడు నాగబాబు స్పందించారు. ఎప్పుడూ తనలో ఎలాంటి భావోద్వేగాలు కన్పించని చంద్రబాబు ఇలా బహిరంగంగా కన్నీరు పెట్టడం చూసి బాధనిపించిందని అన్నారు. గతంలో తమ కుటుంబం కూడా ఇలాంటి సమస్యలు చాలా ఎదుర్కొందని..ఆ బాధ ఎలా ఉంటుందో తమకూ తెలుసన్నారు. ఏపీ అసెంబ్లీలో చెడు సంప్రదాయం మొదలైందని, వ్యక్తిగత దూషణలు సరికావన్నారు. శాసనసభ హుందాతనం కోల్పోయిందని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో విమర్శలు ఉండాలే కానీ తిట్లు ఉండకూడదని నాగబాబు సూచించారు. అయితే ఈ పద్దతి ఇప్పుడే కొత్తగా ప్రారంభం అయిందని తాను చెప్పటం లేదని..టీడీపీ హయాంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కూడా టీడీపీ నేతలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్నారు.
దీనిపై సీఎం జగన్ కూడా బాధపడ్డారన్నారు. అటు చంద్రబాబు అయినా..ఇటు జగన్ అయినా రాజకీయంగా విమర్శించుకోవాలే కానీ..కుటుంబ సభ్యులను..ఆడవాళ్లను ఇందులోకి లాగటం ఏ మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ఇది ఎవరు చేసినా తప్పేనన్నారు. పరిపాలన, విధానాలపై చంద్రబాబుపై, జగన్ పై తాము కూడా గట్టిగా చాలా సార్లు మాట్లాడామని..రాజకీయాల్లో విమర్శలు ఉండాలే కానీ..తిట్లు ఉండకూడదన్నారు. వ్యక్తిగతంగా దూషించటం అసహ్యమైన పని అని..ఇప్పుడు చంద్రబాబు సతీమణిపై విమర్శలు చేశారన్నారు. ఆమెకు కుటుంబ వ్యవహారాలు. ఫ్యామిలీ బిజినెస్ తప్ప రాజకీయాలతో సంబంధం లేదని నాగబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు చంద్రబాబు, లోకేష్ ను రాజకీయంగా ఎంత విమర్శించినా తప్పులేదని..కానీ వ్యక్తిగత దూషణలు చేయటం సరికాదన్నారు. ఈ మేరకు నాగబాబు ఓ వీడియోను విడుదల చేశారు.