రాజగోపాల్ రెడ్డిదీ..గంటా పరిస్థితే అయితే!
తెలంగాణ రాజకీయాలను బిజెపి తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తోంది. అందుకే కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కాంగ్రెస్ పార్టీకి..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి ఉప ఎన్నికలో విజయం సాధించాలనేది ఆ పార్టీ ప్లాన్. అది అంత తేలిగ్గా జరుగుతుందా?. అంటే ఖచ్చితంగా నో అని చెప్పొచ్చు. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారనే అనుకుందాం. దాన్ని స్పీకర్ ఆగమేఘాల మీద ఎందుకు ఆమోదిస్తారు. ఆయన ఆమోదించే వరకూ..రాజీనామాను నోటిఫై చేసే వరకూ ఉప ఎన్నిక రాదు. కోమటిరెడ్డి రాజీనామా అనంతరం ఈ వ్యవహారం అంతా పూర్తిగా అధికార టీఆర్ఎస్ చేతిలోకి వెళుతుంది. సాంకేతికంగా స్పీకర్ రాజీనామాను ఆమోదించాల్సి ఉంటుంది. ఆయన నిర్ణయం తీసుకోవటానికి నిర్ధిష్ట గడువు ఏమీ ఉండదు. ఈ అంశంపై కోర్టును ఆశ్రయించి చేయగలిగేది కూడా ఏమీ ఉండదు. మునుగోడులో ఉప ఎన్నిక రావాలా వద్దా అన్నది పూర్తిగా అధికార టీఆర్ఎస్ చేతిలోనే ఉంటుందనే విషయం పక్కా. రాజీనామా ఆమోదించకపోతే ఓటమి భయంతోనే టీఆర్ఎస్ ఇలా చేస్తోందనే విమర్శలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. అందుకు అధికార టీఆర్ఎస్ ముందే గ్రౌండ్ సిద్ధం చేస్తోంది.
అసలు బిజెపి తెలంగాణకు ఏమి చేసిందని ఉప ఎన్నిక కావాలి అని ఆర్ధిక మంత్రి హరీష్ రావు తాజాగా ప్రశ్న లేవనెత్తారు. అప్పట్లో తాము రాష్ట్ర సాధనకు రాజీనామా చేసి ఉప ఎన్నికలు తెచ్చామని..బిజెపి బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇచ్చిందా..ఐటిఐఆర్ ప్రాజెక్టు ఇచ్చిందా..విభజన హామీలు అమలు చేసిందా..ఎందుకు కావాలి ఉప ఎన్నిక అని ప్రశ్నించారు. ఇదే ఆ పార్టీ వైఖరి అవుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. స్థానిక పరిస్థితులను పూర్తిగా మదింపు చేసిన తర్వాత...టీఆర్ఎస్ గెలుపు పక్కా అని నిర్ధారించుకున్న తర్వాతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ఆమోదించే అవకాశం ఉంది. అంతే కాదు..రాజీనామా ఆమోదం పొందేలోగానే మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి కీలక నేతలుగా ఉన్న వారిని అధికార టీఆర్ఎస్ ఎలాగైనా తన వైపు తిప్పుకోగలదు. ఇందుకు అందుబాటులో ఉన్న అన్ని ఆస్త్రాలను వాడుతుంది. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. ఉదాహరణకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖపట్నానికి చెందిన మాజీ మంత్రి , ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు. రెండవ సారి అది కూడా స్పీకర్ ఫార్మెట్ లోనే. ఇప్పటి వరకూ స్పీకర్ దాన్ని ఆమోదించలేదు. రాజకీయంగా ప్రత్యర్ధి పార్టీకి మేలు జరుగుతుంది అంటే ఏ పార్టీ అయినా ఇలాగే చేస్తుంది. తప్పు ఒప్పులు గురించి అసలు వారు ఆలోచించరు అన్న విషయం తెలిసిందే.