బిజెపికి ముకుల్ రాయ్ షాక్

Update: 2021-06-11 12:29 GMT

బిజెపికి ముకుల్ రాయ్ షాకిచ్చారు. ఎలాగైనా ప‌శ్చిమ బెంగాల్ లో అధికారంలోకి రావాల‌ని స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డినా ఆ పార్టీకి నిరాశే ఎదురైంది. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ అనూహ్య విజ‌యాన్ని ద‌క్కించుకుని ముచ్చ‌ట‌గా మూడ‌వ‌సారి సీఎం పీఠాన్ని అధిష్టించిన విష‌యం తెలిసిందే. దీంతో ఎన్నిక‌ల‌కు ముందు టీఎంసీకి గుడ్ బై చెప్పి బిజెపిలో చేరిన వారంతా ఇప్పుడు అల్లాడిపోతున్నారు. తిరిగి సొంత గూటికి చేరేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. అందులో భాగంగానే తొలుత బిజెపి జాతీయ ఉపాధ్య‌క్షుడు ముకుల్ రాయ్ తిరిగి సొంత గూటికి చేరారు. నాలుగేళ్ల క్రితమే బీజేపీలో చేరిన ముకుల్ రాయ్ మళ్లీ తృణ‌మూల్ కాంగ్రెస్‌లో చేరారు. ఈ మేరకు శుక్రవారం మ‌ధ్యాహ్నం ముకుల్ రాయ్‌ తన కుమారుడు సుభ్రంగ్షు రాయ్‌తో కలిసి బెంగాల్‌ ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీతో సమావేశం అయ్యారు. ఆ తర్వాత తిరిగి సొంత గూటికి చేరుతున్నట్లు ప్రకటించారు.

2017లో టీఎంసీని వీడిన ముకుల్‌రాయ్‌.. బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. బీజేపీ గురువారం నిర్వ‌హించిన స‌మావేశానికి ముకుల్ రాయ్ హాజ‌రు కాలేదు. దీంతో ఆయ‌న పార్టీని వీడ‌టం ఖాయం అని ప్ర‌చారం జ‌రిగింది. అన్న‌ట్లుగానే ఆయ‌న బిజెపికి గుడ్ బై చెప్పారు. ముకుల్ రాయ్ 2017 లో టిఎంసి నుంచి వైదొలిగిన తరువాత, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ముకుల్ రాయ్ ఇటీవల కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఆయన సతీమణి కూడా కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆ సమయంలో మ‌మ‌తా బెన‌ర్జీ మేన‌ల్లుడు అభిషేక్‌ బెనర్జీ ఆసుపత్రిలో వీరిద్దరిని కలిసి అండగా నిలిచారని సుభ్రాంగ్షు ఇటీవల మీడియాతో చెప్పారు.

Tags:    

Similar News