రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న ప్రధాని నరేంద్రమోడీ రైతులను దారుణంగా మోసం చేశారన్నారు. ఉద్యోగాల విషయంతోపాటు నల్లధనం వెనక్కి తెప్పించే అంశంలోనూ ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. అంతర్జాతీయంగా ఇంథన ధరలు తగ్గినా కూడా దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు పెంచి మోడీ దారుణంగా దోచుకున్నారని మండిపడ్డారు. కేంద్రంలో మోడీ, తెలంగాణలో కెసీఆర్ సామాన్య ప్రజలపై, మధ్యతరగతిపై దారుణంగా భారం మోపారని విమర్శించారు. రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చానని చెప్పుకుంటున్న కెసీఆర్ ఇంతకంటే ఎక్కువే ప్రజల నుంచి దోచుకుంటున్నారని విమర్శించారు. శనివారం నాడు రేవంత్ రెడ్డి చేవేళ్ళలో పెరిగిన ధరలను నిరసిస్తూ పాదయాత్ర నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తోపాటు పలువురు పాల్గొన్నారు.
బీజేపీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు, ఉప్పు, పప్పు నూనె ధరలు అధికంగా పెరిగి సామాన్యులు బతకలేని పరిస్థితి ఏర్పడిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేదల పక్షాన ఉండి పోరాటాలు చేస్తుందన్నారు. బీజేపీ పాలనలో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. సామాన్యుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తుందని అందుకే దేశవ్యాప్తంగా ఈ నిరసన ర్యాలీలని చెప్పారు. ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్న కాంగ్రెస్‌కు ప్రజలు మద్దతుగా నిలవాలని దిగ్విజయ్ సింగ్ కోరారు.