తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశంపై కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ట్వీట్ చేసినప్పటి ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. రాహుల్ ట్వీట్ కు ఎమ్మెల్సీ కౌంటర్ ఇవ్వగా..ఆమెపై కాంగ్రెస్ ఎంపీ, తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాకూర్ ఎటాక్ ప్రారంభించారు. మాజీ ఎంపీలను లోక్ సభలోపలికి అనుమతించరని..దీంతో మీరు సభలోకి రాలేరని కవిత నుద్దేశించి ఎద్దేవా చేశారు ఠాకూర్. అదే సమయంలో టీఆర్ఎస్ ఎంపీలు ఏమీ వెల్ లో లేరని..వాళ్లు సెంట్రల్ హాల్ లో డోక్లా, బిర్యానీలు తింటున్నారని విమర్శించారు. ఠాకూర్ విమర్శలపై కవిత కూడా వెంటనే కౌంటర్ ఇచ్చారు.
మాణికం ఠాగూర్ ఈ దురహంకారమే అదే లోక్‌సభ లో కాంగ్రెస్ పార్టీని రెండంకెలకు దిగజార్చిందని మండిపడ్డారు. గెలుపోటములతో సంబంధం లేకుండా తాను నిరంతరం నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తున్నానన్నారు. అంతేతప్ప మీ నాయకుడు రాహుల్ గాంధీ లాగా పారిపోలేదని, రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయలేదని సమాధానమిచ్చారు. ప్రస్తుత చర్చ ఒక దేశం.. ఒకే ధాన్యం సేకరణ విధానం దీనిపై రాహుల్ గాంధీ స్టాండ్ ఏమిటో చెప్పాలన్నారు. టిఆర్ఎస్ పార్టీ అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ రైతుల పక్షమే తెలంగాణ రాష్ట్రంలోని చివరి గింజ కొనే వరకు మేము పోరాడుతాం.. నిలదీస్తామన్నారు.