
బిజెపిని ఢీకొట్టి పశ్చిమ బెంగాల్ లో హ్యాట్రిక్ కొట్టిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా మూడవ సారి ప్రమాణ స్వీకారం చేశారు. కరోనా కారణంగా బుధవారం నాడు అత్యంత సాదాసీదాగా సాగిన కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కడ్ మమతతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పాల్గొన్నారు.
టీఎంసీకి ఆయన ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన విషయం తెలిసిందే. గురువారం నాడు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర శాసనసభలోని 294 స్థానాలకు గాను 292 సీట్లకు ఎన్నికలు జరగ్గా ఇందులో టీఎంసీ 213 స్థానాలు, బీజేపీ 77 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఎలాగైనా ఈ సారి పశ్చిమ బెంగాల్ లో పాగా వేయాలని బిజెపి చేసిన విశ్వప్రయత్నాలు విఫలం అయ్యాయి.