పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య దేశమైన భారత్ ను బిజెపి ఇప్పుడు నిఘా దేశంగా మార్చిందని ధ్వజమెత్తారు. న్యాయ వ్యవస్థ ఒక్కటే ఈ దేశాన్ని కాపాడగలదని వ్యాఖ్యానించారు. ఇంత మంది ఫోన్లను హ్యాక్ చేసినందున ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారించాలని ఆమె అభ్యర్ధించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. పెగాసెస్ స్పైవేర్ సాఫ్ట్ వేర్ తో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాందీతోపాటు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, కొంత మంది న్యాయమూర్తులు, మీడియా ప్రతినిధుల ఫోన్ల హ్యాక్ అయినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై గత కొన్ని రోజులుగా పార్లమెంట్ లో దుమారం సాగుతోంది.
ఈ అంశంపై మమతా బెనర్జీ ఓ వర్చువల్ సమావేశంలో మాట్లాడుతూ స్పందించారు. పెగాసెస్ కు భయపడి తన ఫోన్ కు కూడా ప్లాస్టర్లు వేశానని ఆమె వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రులపై కూడా బిజెపి నిఘా పెడుతుందని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోకుండా...అందరిపై నిఘా పెడుతోందని విమర్శించారు. దీని కోసం ప్రమాదకర సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేస్తుందని అన్నారు.అయితే హ్యాకింగ్ వంటివి ఏవీ బిజెపిని కాపాడలేవని..2024లో బిజెపి ప్రభుత్వానికి ప్లాస్టర్ వేయాల్సిన అవసరం ఉందని..దీని దేశంలోని ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని అన్నారు. త్వరలోనే ఢిల్లీ వెళ్ళి ప్రతిపక్ష పార్టీల నేతలు అందరినీ కలవనున్నట్లు తెలిపారు.