డీఎంకె అధినేత ఎం కె స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా శుక్రవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ సాదాసీదాగా సాగిన కార్యక్రమంలో స్టాలిన్ తో పాటు ఆయన మంత్రివర్గ సహచరులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కరోనా కారణంగా ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలోనే అతిధులను అనుమతించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయటంతో ఎం కె స్టాలిన్ ముఖ్యమంత్రి కల నెరవేరింది. ఆయన తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించిన సంగతి విదితమే. స్టాలిన్ కేబినెట్లో 34 మందికి చోటు దక్కింది. గతంలో డీఎంకే ప్రభుత్వ హయాంలో మంత్రులుగా వ్యవహరించిన వారితోపాటూ యువకులు, కొత్త వారికి స్టాలిన్ అవకాశం ఇచ్చారు.
దురైమురుగన్, కెఎన్. నెహ్రూ, ఐ. పెరియస్వామి, పొన్ముడి, వేలు, ఎంఆర్కే పన్నీర్‌సెల్వం, కేకేఎస్‌ఆర్ రామచంద్రన్, తంగం తెన్నరసు, రఘుపతి, ముత్తుస్వామి, పెరయకుప్పన్, టీఎం. అన్బరసన్, ఎంపీ స్వామినాథన్, గీతా జీవన్, అనితా రాధాకృష్ణన్, రాజకన్నప్పన్, కె. రామచంద్రన్, చక్రపాణి, వి. సెంథిల్ బాలాజీ, ఆర్. గాంధీ, ఎం సుబ్రమణియన్, పి. మూర్తి, ఎస్ఎస్ శివశంకర్, పీకె. శేఖర్‌బాబు, పళనివేల్ త్యాగరాజన్, ఎస్ఎం. నాజర్, సెంజి కేఎస్ మస్తాన్, అన్బిల్ మహేష్ పొయ్యామొళి, ఎస్వీ గణేశన్, మనో తంగరాజ్, మదివేందన్, కయల్విళి సెల్వరాజ్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. మొత్తం 234 స్థానాలకు గానూ డీఎంకే కూటమి 118 సీట్ల మెజారిటీ మార్క్ ను సునాయాసంగా దాటేసి, 156 సీట్లను గెల్చుకుంది. అన్నాడీఎంకే కూటమికి 78 సీట్లు లభించాయి.