వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు నోటీసులు జారీ అయ్యాయి. ఆ పార్టీ చేసిన అనర్హత పిటీషన్ కు సంబంధించి 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో లోక్ సభ సచివాలయం జారీ చేసిన నోటీసులో కోరారు. ఇప్పటికే వైసీపీ పలుమార్లు రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలంటూ పలు పిటీషన్లు ఇచ్చింది. అదే సమయంలో ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ పలు ఆధారాలు కూడా స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించింది. ఈ తరుణంలో రఘురామకృష్ణరాజుకు నోటీసులు జారీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది.
రఘురామకృష్ణరాజుతోపాటు టీఎంసీ ఎంపీలు శిశిర్ అధికారి, సునీల్ కుమార్ మండల్ కు కూడా నోటీసులు జారీ అయ్యాయి. అయితే రఘురామకృష్ణరాజు మాత్రం తాను ఎలాంంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని..కేవలం ప్రభుత్వంలో జరిగే తప్పులను దిద్దుకోవాలని మాత్రమే ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నట్లు చెబుతున్నారు. రఘురామకృష్ణరాజు సమాధానం తర్వాత స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతున్నది అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.