తెలంగాణ తెలుగుదేశం ప్రెసిడెంట్ ఎల్ రమణ గురువారం రాత్రి ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కెసీఆర్ తో సమావేశం అయ్యారు. రమణను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దగ్గర ఉండి సీఎం కెసీఆర్ దగ్గరకు తీసుకెళ్ళారు. ఆయన టీఆర్ఎస్ లోకి వెళతారనని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో ఈ భేటీ జరగటం ప్రాధాన్యత సంతరించుకుంది. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ బీ సీ నేత అయిన ఎల్ రమణను పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
ఆయనకు త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో చోటు కల్పించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కెసీఆర్ తో భేట అనంతరం రమణ మీడియాతో మాట్లాడారు. కలసి పనిచేద్దామని కెసీఆర్ ఆహ్వానించారన్నారు. అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ సీఎం కెసీఆర్ కు రమణ అంటే ప్రత్యేక అభిమానం అని...ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు. ఇందుకు రమణ కూడా సానుకూలగానే స్పందించారన్నారు. తెలంగాణలో టీడీపీ మనుగడ సాగించే పరిస్థితి లేదన్నారు.