భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్పుడే అంత మారిపోయారా?. అధిష్టానం హెచ్చరికలు పనిచేశాయా? లేక కొంత కాలం వేచిచూద్దామని అనుకుంటున్నారా?. నూతన పీసీసీ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డిని నియమించిన తర్వాత ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఏకంగా తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాకూర్ పోస్టును అమ్మేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు టీపీసీసీ కాస్తా టీడీపీపీసీసీగా మారిందని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలపై అధిష్టానం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి నివేదిక కూడా కోరింది. సోమవారం నాడు కోమటిరెడ్డి వ్యాఖ్యలు మరింత ఆసక్తిని పెంచాయనే చెప్పాలి. "ఇకపై ప్రజా సమస్యలు తీర్చేందుకు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని.. తనను రాజకీయాల్లోకి లాగవద్దని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఇప్పటి నుంచి రాజకీయపరమైన విషయాలపై ఎటువంటి వ్యాఖ్యలు చేయనని.. దానికి సహకరించాలని జర్నలిస్టులను కోరారు. తాను భువనగిరి ఎంపీ ఎన్నికైన నుంచి అన్ని గ్రామాల్లో పర్యటించలేదని.. కరోనా కాలంగా కొద్ది గ్రామాలకు మాత్రమే వెళ్లినట్లు తెలిపారు. ఇక నుంచి భువనగిరి, నల్గొండ పార్లమెంట్ పరిధిలోని ప్రతి గ్రామంలో పర్యటించి అక్కడ తిష్ట వేసిన సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషిచేస్తానని వివరించారు.
అలాగే గ్రామాల అభివృద్దికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడి నిధులు తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తానని వెల్లడించారు. గ్రామాల్లో చాలా సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కారానికి పూర్తిగా సమయం కేటాయిస్తానని తెలిపారు. నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఎవరైనా తన తలుపు తట్టవచ్చని వెల్లడించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు జాప్యం వల్ల నల్గొండ జిల్లాలో వేలాది ఎకరాలు బీడు వారుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని తెలిపారు. అలాగే 90శాతం పూర్తయిన బ్రహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు వంద కోట్లు ఖర్చు చేస్తే పూర్తై వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని వెల్లడించారు. ఇందుకోసం ప్రభుత్వంపై పోరాటం చేస్తానని తెలిపారు. వీటితో పాటు భువనగిరి పార్లమెంట్ పరిధిలోని గంధమల్ల, బస్వాపురం రిజర్వాయర్లు త్వరగా అందుబాటులోకి వచ్చేలా సర్కార్‌పై ప్రజల పక్షాన యుద్దం చేస్తానని తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజా వ్యాఖ్యలు చూస్తుంటే అధిష్టానం హెచ్చరికలు పననిచేసినట్లే కన్పిస్తున్నాయని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి వర్గం కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.