కీలక పరిణామాం. పార్లమెంట్ అయినా..అసెంబ్లీ అయినా కొన్నిసార్లు తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరుగుతాయి. చాలా సార్లు సభ్యులే కాదు..ఏకంగా మంత్రులు కూడా ఆగ్రహంతో ఊగిపోతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత సభకు..సభ్యులకు క్షమాపణలు కూడా చెబుతారు. ప్రభుత్వంపై విమర్శలు చేసే క్రమంలో ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఆ తర్వాత వాటిని స్పీకర్ లు రికార్డుల నుంచి తొలగిస్తారు. ఇది ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయం. మరీ హద్దులు మీరి వ్యవహరించే సభ్యులు సభ నుంచి కూడా సస్పెండ్ చేసిన ఘటనలు ఎన్నో. అయితే తాజాగా లోక్ సభ సచివాలయం విడుదల చేసిన బుక్ లెట్ ఒకటి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అత్యంత సహజంగా వాడే పదాలను కూడా అన్ పార్లమెంటరీ పదాలు అని పేర్కొనటమే కాకుండా..వాటిని వాడితే రికార్డుల నుంచి తొలగిస్తామని పేర్కొనటం దుమారం రేపుతోంది. దీనిపై కొంత మంది సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది గ్యాగ్ ఆర్డర్ తప్ప మరొకటి కాదని టీఎంసీ ఎంపీ డిరెక్ ఓబ్రెయిన్ మండిపడ్డారు. అత్యంత సహజంగా వాడే పదాలపై కూడా నిషేధం విధించారని..తాను వీటిని వాడతాను సస్పెండ్ చేయండి అంటూ ట్వీట్ చేశారు.
ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేస్తానన్నారు. లోక్ సభ సచివాలయం విడుదల చేసిన బుక్ లెట్ ప్రకారం జుమ్లా జీవి (బూటక హామీదారుడు), బాజ్ బుద్ది (కొద్దిబుద్ది), కోవిడ్ స్ర్పెడర్ (కోవిడ్ వ్యాప్తి చేస్తున్నవాడు), స్నూప్‌గేట్' పదాలతోపాటు ఎషేమ్డ్డ్ (సిగ్గుమాలినతనం), ఎబ్యూజ్డ్ (దుర్భాష), బిట్రేడ్ (ద్రోహం చేశారు), కరప్ట్ ('అవినీతి'), డ్రామా (నాటకం) హిపోక్రసీ (అతిశయం') లాంటి పదాలను కూడా ఇకపై అన్‌పార్లమెంటరీ పదాలుగా పరిగణిస్తామని తెలిపింది. ఈనెల 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ బుక్‌లెట్‌ను విడుదల చేశారు. సభ్యులు సమావేశాల్లో వివిధ అంశాలపై చర్చలు జరిపే సందర్భాల్లో, చేసే ప్రసంగాల్లో అనార్కిస్టు (అరాచకవాది'), శకుని, జైచంద్ (ద్రోహి) వినాశ్‌పురుష్ (వినాశకారి), ఖలిస్థానీ, చీటర్ (మోసకారి), నికమ్మా (దద్దమ్మ) బేహ్రీ సర్కార్ (చెవిటి ప్రభుత్వం), బ్లడ్‌షెడ్ (రక్తపాతం), డాంకీ(గాడిద) పదాలను ఉపయోగిస్తే సభాధ్యక్షులు వాటిని కూడా అన్‌పార్లమెంటరీ పదాలుగా పరిగణించి, తమ విచక్షణ మేరకు రికార్డుల నుంచి తొలగిస్తారని కూడా బుక్‌లెట్‌లో పేర్కొన్నారు. పదాల వ్యవహారం పార్లమెంట్ లో కొత్త పంచాయతీకి కారణమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.