కాంగ్రెస్ కు పీ సీ చాకో గుడ్ బై

Update: 2021-03-10 11:42 GMT

కాంగ్రెస్ కు ఎదురుదెబ్బలు ఆగటం లేదు. ఎన్నికల ముందు పుదుచ్చేరిలో ప్రభుత్వం పతనం. ఇప్పుడు కీలక దశలో కేరళకు చెందిన సీనియర్ నేత, మాజీ ఎంపీ పీ సీ చాకో పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపినట్టు తెలిపారు. అదే సమయంలో సమయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో వర్గ విభేదాలు, నాయకత్వ లేమి ఉందన్నారు. పార్టీలో కొనసాగలేని పరిస్థితి వల్లే తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఏడాదికి పైగా పార్టీకి అధ్యక్షుడే లేడని, కొత్త అధ్యక్షుడిని తీసుకు వచ్చే ప్రయత్నాలు కూడా జరగలేదని, తలలేని పార్టీగా పనితీరు ఉందని చాకో వ్యాఖ్యానించారు.

రాహుల్‌తో సహా పార్టీ అధిష్ఠానాన్ని ఎవరూ ప్రశ్నించే పరిస్థితి లేదన్నారు. కేరళలో కాంగ్రెస్ అనేదే లేకుండా పోయిందని, ఈ విషయం పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేసినా విఫలమయ్యానని చెప్పారు. కేరళలో కాంగ్రెస్ రోజురోజుకూ కనుమరుగవుతోందని, ఇందుకు నిరసనగానే తాను పార్టీకి రాజీనామా ఇచ్చానని చెప్పారు. కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం అనేది మిగలలేదని అన్నారు. అభ్యర్థుల జాబితాపై రాష్ట్ర కాంగ్రెస్ కమిటీతో చర్చించలేదని తెలిపారు. కేరళలో బీజేపీ పెద్దగా లబ్ధి పొందేది ఏమీ ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News