తెలంగాణలో మళ్లీ ముందస్తు ఎన్నికలు వస్తాయా?. కెసీఆర్ తన తొలి టర్మ్ లో అనుసరించిన ఫార్ములానే ఇప్పుడూ అనుసరించబోతున్నారా?. ఒకసారి సక్సెస్ అయిన ఫార్ములా పదే పదే పనిచేస్తుందా?. వాస్తవానికి రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు ఛాన్స్ ఉందని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో ప్రచారంలో పెట్టారు. అయితే కొద్ది రోజుల క్రితం జరిగిన పార్టీ సమావేశంలో మాత్రం కెసీఆర్ ముందస్తు ఎన్నికలకు చాన్స్ లేదంటూ కొట్టిపారేశారు. అయితే తాజాగా ఢిల్లీలో తెలంగాణ బిజెపి నేతలతో సమావేశం అయిన కేంద్ర హోం మంత్రి, బిజెపి అగ్రనేత అమిత్ షా తెలంగాణలో ముందస్తు ఎన్నికల అంశాన్ని ప్రస్తావించటం ఆసక్తిరేపుతోంది. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని...కెసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ ఉందని అమిత్ షా వ్యాఖ్యానించినట్లు వచ్చిన వార్తలు ఆసక్తికర పరిణామంగా మారాయి.
టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ గత కొంత కాలంగా పార్టీ కార్యకలాపాల స్పీడ్ పెంచారు. అందుకే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయటంతోపాటు పార్టీ కార్యక్రమాల వేగం పెంచారు. అయితే కెసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తే ఈ వ్యవహారం ఎన్నికల సంఘం చూసుకుంటుందని అమిత్ షా వ్యాఖ్యానించినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే తెలంగాణలో మరోసారి ముందస్తు ఎన్నికలకు అటు కేంద్రం, ఇటు సీఈసీ సహకరిస్తే మాత్రం ఇది అంతా బిజెపి సమ్మతితోనే జరిగిందని భావించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఇందుకు బిజెపి ఏ మేర సహకరిస్తుంది అన్నది వేచిచూడాల్సిందే.