ముందస్తు కాదు..ఎన్నికలు రేపు పెట్టినా రెడీ
కొడుకు..బిడ్డకు అధికారమిచ్చారు..సర్పంచ్ లకు కాదు
కెసీఆర్ ను దింపటానికి బండి చాలు..నేను అక్కర్లేదు
అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ సర్కారుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో ఇంత చేతకాని..అవినీతి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదన్నారు. తెలంగాణాలోని నిజాం ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన సమయం ఆసన్నం అయిందని అన్నారు. ఫాంహౌస్ లో కూర్చుని చంద్రశేఖర్ రావు ముందస్తు ఎన్నికల ఏర్పాట్లు చేసుకుంటున్నారని...ముందస్తు కాదు..రేపు ఎన్నికలు పెట్టినా బిజెపి రెడీగా ఉందన్నారు. కెసీఆర్ తన కొడుకు, బిడ్డకు అధికారం ఇచ్చారు కానీ..రాష్ట్రంలో సర్పంచ్ లకు మాత్రం ఇవ్వలేదన్నారు. తెలంగాణాలో కేసీఆర్‌ను గద్దె దించేందుకు తాను రానక్కరలేదని, బండి సంజయ్ ఒక్కడు చాలని అమిత్ షా వ్యాఖ్యానించారు. బండి సంజయ్ ది అధికారం కోసం చేసిన యాత్ర కాదని..ఇది ప్రజలందరి సంక్షేమం కోసం చేసిన యాత్ర అని అన్నారు. నిరంకుశపాలనను అంతమొందించడం కోసం ఈ యాత్ర అని షా స్పష్టం చేశారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర రెండవ దశ ముగింపు సందర్భంగా తుక్కుగూడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన అమిత్ షా ప్రసంగించారు. కెసీఆర్ ఇచ్చిన అత్యంత కీలకమైన నీళ్లు, నిధుల, నియామకాల హామీని అమలు చేయలేదని..బిజెపికి అధికారం ఇస్తే తాము అమలు చేసి చూపిస్తామని ప్రకటించారు.
రైతుల రుణ మాఫీ కూడా అమలుకు నోచుకోలేదన్నారు. కెసీఆర్ సర్కారును విసిరిపారేయాల్సిన సమయం వచ్చిందని అన్నారు. కేసీఆర్ మజ్లిస్ చంక ఎక్కికూర్చున్నారని, మజ్లిస్ పార్టీ అంటే కేసీఆర్‌కు భయమని, తెలంగాణ విమోచనదినం గురించి కేసీఆర్ వాగ్దానం చేశారా? లేదా అని అమిత్ షా ప్రశ్నించారు. టీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఒవైసీ చేతిలో ఉందని, టీఆర్ఎస్, మజ్లిస్‌ను ఒకేసారి విసిరేయాలని ప్రజలకు షా పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని బెంగాల్ లా మారుద్దామని కేసీఆర్ భావిస్తున్నారని షా విమర్శించారు. ఇందుకు అనుమతి ఇద్దామా అని సభికులననుద్దేశించి ప్రశ్నించారు. సాయిగణేష్ హత్యపై ఏం సమాధానం చెబుతారని? ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో హామీ ఇచ్చి కేవలం ఎంఐఎంకు భయపడి విమోచన దినోత్సవాన్ని జరపటంలేదని మండిపడ్డారు. బిజెపికి అధికారం ఇస్తే జరిపి చూపిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను పేర్లు మార్చి తెలంగాణలో అమలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కమిషన్ లు వచ్చే ప్రాజెక్టులను కెసీఆర్ పూర్తి చేస్తున్నారని ఆరోపించారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రిలను పట్టించుకోని కెసీఆర్ కొత్తగా నాలుగు ఆస్పత్రులు కడతానని ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.