టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ పై మాజీ మంత్రి, బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ కాలంలో ఉన్న నాటి కెసీఆర్ కు...ఇప్పటి కెసీఆర్ కు చాలా తేడా ఉందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పెట్టడం ద్వారా హైదరాబాద్ లో ప్రస్తుతం ఉన్న విష సంస్కృతిని దేశమంతటికి విస్తరింప చేస్తారా అని ప్రశ్నించారు. పదవుల కోసం పెదవులు మూసుకున్న దద్దమ్మలు టీఆర్ఎస్ నేతలు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవి తన ఎడమ కాలి చెప్పుతో సమానం అని వ్యాఖ్యానించటం ప్రజలను అవమానించటమే అన్నారు. మంగళవారం నాడు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండాభూదేవి గార్డెన్‌లో నిర్వహించిన ప్రధాని మోదీ ఎనిమిదేళ్ల ప్రజా సంక్షేమ పాలన సదస్సుకు ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ ఒకప్పుడు కేసీఆర్ టీవీలో కనబడితే యువత కేరింతలు కొట్టేవారని.. ఇప్పుడు చీదరించుకుంటున్నారని అన్నారు. తాను పార్టీ మారలేదని, టీఆర్‌ఎస్ వాళ్ళే వెళ్లగొట్టారన్నారు. రెచ్చగొడితే ఆత్మగౌరవం కోసం రాజీనామా చేశానని స్పష్టం చేశారు. రాష్ట్ర సమస్యలపై చర్చకు సిద్ధమని అన్నారు. కాషాయ జెండా తెలంగాణ గడ్డ మీద ఎగరాలని చాలామంది ఎదురు చూస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు. కెసీఆర్ కు గోళీలు ఇచ్చేందుకు సంతోష్ కు రాజ్యసభ ఇచ్చారన్నారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులను ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించారు.