కర్ణాటక లో 14 రోజుల లాక్ డౌన్

Update: 2021-04-26 11:18 GMT

దేశంలో కీలక రాష్ట్రాలు అన్నీ లాక్ డౌన్ లు పెడుతూ ముందుకు సాగుతున్నాయి. ఇఫ్పటికే ఢిల్లీ, ముంబయ్ లు ఇదే బాటలో ఉండగా..ఇప్పుడు ఆ జాబితాలో కర్ణాటక కూడా చేరింది. కరోనా నియంత్రణకు కర్ణాటక ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 14 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప సోమవారం కేబినేట్‌ భేటీ నిర్వహించారు. రాష్ట్రంలోని పరిస్థితులపై సమీక్షించిన అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. నిత్యావసర సర్వీసులకు మాత్రం ఉదయం 6నుంచి 10 గంటల వరకు సడలింపు ఇచ్చారు.

ముఖ్యమంత్రి యడ్యూరప్ప మాట్లాడుతూ 'ఢిల్లీ, మహారాష్ట్రల కన్నా మన దగ్గర పరిస్థితి భయంకరంగా ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. రానున్న రెండు వారాల పాటు కఠిన ఆంక్షలు విధిస్తాం. మే 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారందరికి ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తాం. 45 ఏళ్లు పైబడిన వారికి కేంద్రం ఎలాను ఉచితంగా వ్యాక్సిన్‌ ఇస్తుంది. ప్రతి ఒక్కరు ఇంటి వద్దనే ఉంటూ జాగ్రత్తలు పాటించాలి'' అని కోరారు. తాజాగా కర్ణాటకలో ఆదివారం ఒక్కరోజే 34 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 143 మంది మృతి చెందారు. బెంగళూరు అర్బన్‌లో 20,733 కేసులు వెలుగు చూశాయి.

Tags:    

Similar News