టీఆర్ఎస్ అధినేత, సీఎం కెసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి శాసనమండలికి ఎన్నికయ్యారు. ఆమె ఎన్నిక ఏకగ్రీవం అయింది. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల అభ్యర్థిగా ఆమె మళ్లీ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించడంతో కవిత ఏకగ్రీవానికి మార్గం సుగమం అయింది. మంగళవారం ఆమె నామినేషన్ దాఖలు చేయగా.. ఒక్కరోజు గ్యాప్‌లోనే ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవమైనట్లు ప్రకటన వెలువడింది. తొలుత కవిత రాజ్యసభకు వెళతారని జోరుగా ప్రచారం సాగింది. కానీ అనూహ్యంగా ఆమె మళ్ళీ మండలికే వచ్చారు.
ఒక్కసారి అయినా రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాలని ఆమె గట్టిగా కోరుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బహుశా అందుకే రాజ్యసభకు వెళ్ళకుండా మళ్లీ ఎమ్మెల్సీ మార్గాన్ని ఎంచుకున్నట్లు భావిస్తున్నారు. ఇటీవల రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్‌ను ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ఖరారు చేయడంతో.. ఆయన స్థానంలో కవితను ఢిల్లీకి పంపిస్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఇందుకు తగ్గట్టుగానే నిజామాబాద్ స్థానానికి సిటింగ్ ఎమ్మెల్సీ ఆకుల లలిత పేరు వినిపించింది. కవితతోపాటు శంభీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డిలు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.