రత్నప్రభ భేటీపై కూడా మొక్కుబడి ప్రకటన
అసలు పవన్ కళ్యాణ్ ప్రచారంలో పాల్గొంటారా?
బిజెపి, జనసేన పొత్తు విషయంలో ఏదో తేడా కొడుతోంది. అసలు జనసేన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక విషయంలో బిజెపికి మద్దతు ఇస్తుందా?. జనసేన శ్రేణులు అయితే బిజెపికి అనుకూలంగా ఓటు వేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ నేతల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అసలు పవన్ కళ్యాణ్ తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటారా ..లేదా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తాజాగా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ అభ్యర్ధి, మాజీ ప్రధాని పీవీ కుమార్తెకు అనుకూలంగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన కలకలం రేపింది. అప్పటి నుంచి రెండు పార్టీల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. బిజెపి తిరుపతి లోక్ సభకు సంబంధించి తన అభ్యర్ధిని ప్రకటించిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. అయితే శుక్రవారం సాయంత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో తిరుపతి లోక్ సభ బిజెపి అభ్యర్ధి కె. రత్నప్రభ సమావేశం అయ్యారు.
ఆమెతోపాటు ఏపీ బిజెపి ప్రెసిడెంట్ సోము వీర్రాజుతోపాటు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి, ఏపీ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి సునీల్ దియోదర్ లు ఉన్నారు. సుమారు గంట పాటు సాగిన ఈ సమావేశంలో తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు జనసేన ఒక ప్రకటనలో తెలిపింది. అందులో కూడా ఎక్కడా బిజెపి అభ్యర్ధికి జనసేన శ్రేణులు మద్దతుగా నిలవాలని కూడా పిలుపునివ్వకపోవటం విశేషం. బిజెపి తన సోషల్ మీడియా ప్రచారంలో బిజెపి, జనసేన బలపర్చిన అభ్యర్ధి అని ప్రచారం చేసుకుంటున్నా జనసేన ఎక్కడా కూడా ఈ ఎన్నిక వ్యవహారంలో ఇంత వరకూ తలదూర్చినట్లు కన్పించటం లేదు.