కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన లేఖ మీడియాకు ఎలా లీకయిందో తెలియదన్నారు. తానేమీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంలేదని..పార్టీ మంచి కోసమే మాట్లాడుతున్నానని వ్యాఖ్యానించారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మంచి చేస్తే అభినందిస్తా..కరెక్ట్ లేకపోతే ప్రశ్నిస్తానని అన్నారు. తమలో తమకు ఎన్ని విభేదాలు ఉన్నా, తమ మీదకు ఎవరువచ్చినా కలిసి పోరాడతామని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలపై కలిసి కట్టుగా పోరాడతామన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నడిపిస్తున్న తీరుపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన పార్టీ అధిష్టానానికి రాసిన లేఖ కలకలం రేపిన విషయం తెలిసిందే. సరిగ్గా రేవంత్ రెడ్డి ఎర్రవెల్లిలో సీఎం కెసీఆర్ 150 ఎకరాల్లో వరి సాగుచేస్తున్నారని..రైతులను వద్దని ఆయన ఎలా చేస్తారని ప్రశ్నించిన తరుణంలో జగ్గారెడ్డి లేఖ వ్యవహారం పార్టీలో సైతం పెద్ద చర్చనీయాంశంగా మారింది.