కెసీఆర్ పాలనకు త్వరలోనే ముగింపు

Update: 2020-11-27 15:29 GMT

బిజెపి జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డా శుక్రవారం నాడు హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. కొంత మంది నేతలు కార్పొరేటర్ల ఎన్నికలకు కూడా బిజెపి జాతీయ అధ్యక్షుడు రావాలా? అని వ్యాఖ్యానిస్తున్నారని..అవినీతిని అంతమొందించటానికి తాము ఎక్కడకైనా వస్తామని అన్నారు. వర్షం కురుస్తున్నా ఆయన కొద్దిసేపు రోడ్ షోలో పాల్గొన్నారు. కొత్తపేట నుంచి నాగోల్‌ వరకు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. ప్రతి డివిజన్‌లో కమలం జెండా రెపరెపలాడుతుందని చెప్పారు.

ప్రజల స్పందన చూస్తుంటే కేసీఆర్ పాలనకు ముగింపులా అనిపిస్తోందన్నారు. కెసీఆర్ తెలంగాణను అప్పుల మయంగా మార్చారని విమర్శించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కొత్త హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ పని అయిపోయిందని, ప్రజలు గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు తగిన గుణపాఠం చెబుతారన్నారు. గల్లీ ఎన్నికలకు ఢిల్లీ నేతలు వస్తున్నారని కేటీఆర్ విమర్శిస్తున్నారని వారి డ్రామాలు ఇకమీదట సాగవని జేపీ నడ్డా మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలనకు ప్రజలు త్వరలోనే చరమగీతం పాడుతారని చెప్పారు. తెలంగాణలో వచ్చేది బిజెపి ప్రభుత్వమే అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధులను గెలిపించాలని ఆయన కోరారు.

Tags:    

Similar News