వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన గురువారం నాడు విశాఖపట్నంలో జరిగిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సభలో మాట్లాడారు. తనకు డబ్బుపై ఆశలేదని..హైదరాబాద్ లో తాను ఉంటున్నది కూడా అద్దె ఇల్లే అని వ్యాఖ్యానించారు. తనకు విశాఖలో స్థిరపడాలనే కోరిక ఉందన్నారు. ఉత్తరాంధ్ర ప్రగతే తన ధ్యేయమన్నారు. తనపేరు చెప్పి ఎవరైనా అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికలు అప్పుడే రాజకీయాలు ఉండాలని..ఇప్పుడు అందరూ డెవలప్ మెంట్ పై ఫోకస్ పెట్టాలన్నారు. విశాఖలో పర్యటనలో ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. కొందరు పని కట్టుకుని తన మీద భూ ఆరోపణలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. భూములు ఆక్రమించాలని కానీ.. ఇక్కడ కొనుగోలు చేయాలని తనకు లేదన్నారు. ఇన్ని రోజులుగా తనపై వస్తున్న ఆరోపణలన్నీ అసత్యాలేనని విజయసాయిరెడ్డి తేల్చి చెప్పారు.
అంతకు ముందు వైఎస్ మనసున్న మహారాజు అని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. దివంగత మహానేత వైఎస్ ఆర్ సుపరిపాలన అందించారన్నారు. వైఎస్ఆర్ స్ఫూర్తితో ముందడుగు వేస్తున్నామన్నారు. తండ్రి బాటలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నడుస్తున్నారని తెలిపారు.''ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేరుస్తున్నారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా పాలన చేస్తున్నాం. పార్టీలో కష్టపడిన వారందరికీ న్యాయం జరుగుతుంది. ప్రభుత్వ భూములు ప్రజలకే చెందాలన్నది మా లక్ష్యం. ఎక్కడైనా భూ ఆక్రమణలు జరిగితే ఫిర్యాదు చేయొచ్చు. అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నామని'' ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.