బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మేయర్ పదవిని ఎంఐఎంకి అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం టీఆర్‌ఎస్ చేతిలో కీలుబొమ్మగా మారిందని, ఎంఐఎం చెబితే టీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్ చెబితే ఎన్నికల సంఘం వింటుందన్నారు. ఎంఐఎంకు మేయర్ పదవి దక్కకుండా చూస్తామని, బీజేపీ 100 స్థానాల్లో గెలిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ల నుంచి భాగ్యనగరాన్ని కాపాడుకుంటామని, బీహార్‌లో ఎంఐఎం 5 ఆసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడానికి సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం చేశారని ఆరోపించారు.
శుక్రవారం ఆయన కరీంనగర్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. దుబ్బాక ప్రజలు గుణపాఠం చెప్పినా టీఆర్‌ఎస్‌కు బుద్దిరాలేదని విమర్శించారు. 63 డివిజన్‌లలో హిందువుల ఓట్లు తగ్గించి మైనార్టీ ఓట్లు పెంచారన్నారు. ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసిందని తెలిపారు. అయితే ఎన్నికల సంఘం అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలి కానీ అలా జరగలేదన్నారు.