తెలంగాణ రాజకీయాలను మలుపుతిప్పే హుజూరాబాద్ ఉప ఎన్నిక ముగిసింది. శనివారం ఉదయం నుంచి సాయంత్రం ఫుల్ జోష్ గా సాగిన పోలింగ్ తో గెలుపు ఎవరిది అన్న ఉత్కంఠ నెలకొంది. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బిజెపికే అనుకూలంగా ఫలితం ఉంటుందని తేల్చాయి. టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కమలం గూటికి చేరిన ఈటెల రాజేందర్ తక్కువలో తక్కువగా 10వేల పైన మెజారిటీతో గెలుస్తారని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. గరిష్టంగా మెజారిటీ 15 వేల నుంచి 20 వేల వరకూ రావొచ్చని అంచనాలు వేశారు. ఇది అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని పరిణామమే. ఓ వైపు అత్యంత ప్రతిష్టాత్మకంగా దళితబంధుతోపాటు ఎన్నడూలేని రీతిలో హుజూరాబాద్ పై అధికార పార్టీ వరాల వర్షం కురిపించింది. . అయినా సరే ఫలితం టీఆర్ఎస్ కు ఏ మాత్రం అనుకూలంగా ఉన్నట్లు కన్పించటం లేదు. ముందు నుంచి హుజూరాబాద్ లో గెలుపు ఈటెలదే అన్న ప్రచారం ఉంది. అయితే చివరి రెండు రోజుల్లో సాగిన డబ్బు పంపిణీ ఫలితాన్ని ఏమైనా మారుస్తుందా అనే అనుమానాలు ఉండేవి. అయితే ఎగ్జిట్ పోల్స్ లోనూ డబ్బు పంపిణీ ఏ మాత్రం ప్రభావం చూపించినట్లు కన్పించటం లేదు.
టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి హుజూరాబాద్ నియోజకవర్గం కెసీఆర్ కు అండగా నిలుస్తుందని..ఈ సారి కూడా కెసీఆర్ నాయకత్వంపైనే ప్రజలు విశ్వాసం చూపిస్తారంటూ ఈ ఉప ఎన్నికల బాధ్యత అంతా తన భుజాలపై మోసిన మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. అంటే ఆయన ఓ రకంగా ఈ ఎన్నిక ఈటెల వర్సెస్ కెసీఆర్ అని చెప్పకనే చెప్పారు. మరి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ చూస్తే మాత్రం అధికార పార్టీకి ఫలితం షాకిచ్చేలా ఉంది. ఎగ్జిట్ పోల్స్ నిజం అయితే మాత్రం అధికార పార్టీకి ఇది రాజకీయంగా అతి పెద్ద దెబ్బగా భావించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. కేవలం రెండేళ్ళలో సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉన్న తరుణంలో భూమి, ఆకాశాలను ఏకంగా చేసినా హుజూరాబాద్ లో గెలుపు సాధించలేకపోతే అది టీఆర్ఎస్ కు రాబోయే కాలంలో పలు సవాళ్లను విసిరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మిషన్ చాణక్య, పొలిటకల్ లేబరేటరీతోపాటు హెచ్ఎంఆర్ రిసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్, కౌటిల్యా సొల్యూషన్స్, ఆత్మసాక్షి గ్రూపులు క్లియర్ గా బిజెపి గెలుపును అంచనా వేస్తున్నాయి. నవంబర్ 2న అసలు ఫలితాలు వెల్లడికానున్నాయి. అప్పటివరకూ ఇక ఎవరి లెక్కలు వారు వేసుకుంటూ ఉండాల్సిందే.