హుజూరాబాద్ రాజకీయం రంజుగా మారుతోంది. ఇప్పటికే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బిజెపి అభ్యర్ధిగా ప్రచారంలో చాలా ముందు వరసలో ఉన్నారు. అధికార టీఆర్ఎస్ కూడా గెల్లు శ్రీనివాసయాదవ్ ను అభ్యర్ధిగా ప్రకటించింది. ఆయన బలం అంతా అధికార పార్టీ కావటమే. ఇప్పుడు మరో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి మాజీ మంత్రి కొండా సురేఖను దింపటం దాదాపు ఖాయం చేసింది. దీంతో పోరు మరింత రసవత్తరంగా మారటం ఖాయంగా కన్పిస్తోంది. అభ్యర్ధుల పరంగా చూస్తే టీఆర్ఎస్ కు చెందిన గెల్లు శ్రీనివాసే రాజకీయంగా అంత గుర్తింపు ఉన్న వ్యక్తి కాదు. అటు ఈటెల రాజేందర్, ఇటు కొండా సురేఖలు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన నేతలు. ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి పలుమార్లు గెలిచి స్థానికంగా పట్టు కలిగి ఉండటం ఈటెల రాజేందర్ బలం. గెల్లు శ్రీనివాసయాదవ్ కు సీఎం కెసీఆర్ తాజాగా ప్రకటించిన దళిత బంధు పథకంతోపాటు అధికార పార్టీ పరంగా కలసి వచ్చే పలు అంశాలు ఉన్నాయి. అయితే కొండా సురేఖను బరిలోకి దింపటం ద్వారా కాంగ్రెస్ పార్టీ తాము కూడా ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. అదే సమయంలో గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు సాధించటం ద్వారా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బలంగా ఉందని నిరూపించుకోవాల్సిన అవసరం ఆ పార్టీకి ఉంది.
అందుకే బీసీ సామాజికవర్గానికి చెందిన అభ్యర్ధినే బరిలోకి దింపాలని నిర్ణయించినట్లు కన్పిస్తోంది. దీంతో హుజూరాబాద్ రాజకీయం కొత్త మలుపు తిరగనుంది. అదే సమయంలో కాంగ్రెస్ గతానికి భిన్నంగా చాలా దూకుడు పెంచింది. సీఎం కెసీఆర్ దళిత కార్డును వాడుతుంటే...దళితులను సీఎం కెసీఆర్ ఎలా మోసం చేశారో చూడండి అంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. హుజూరాబాద్ ఎన్నికల్లో ఇదే అంశాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. మరి ఈ ప్రచారంలో ఎవరు పై చేయి సాధిస్తారో వేచిచూడాల్సిందే. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్ దామోదర ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక కసరత్తు పూర్తి చేశారు. ముగ్గురు నేతల పేర్లతో కూడిన జాబితా మాణిక్యం ఠాగూర్‌కు అందజేశారు. బీసీ, ఎస్సీ, ఓసీ అభ్యర్థుల పేర్లు సిఫారసు చేసినట్లు సమాచారం. బీసీ కేటగిరి నుంచి కొండా సురేఖ, ఓసీ కేటగిరి నుంచి కృష్ణారెడ్డి, ఎస్సీ కేటగిరి నుంచి సదానందం పేర్లను సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదంతో ఒకట్రెండు రోజుల్లో కొండా సురేఖ పేరును ప్రకటించే అవకాశం ఉంది.