బిజెపితో ఇక ఫైటింగే
డిసెంబర్ రెండో వారంలో బిజెపి విధానాలపై సదస్సు
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల సన్నాహాక సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలకు సంబంధించి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసేందుకు బుధవారం తెలంగాణ భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కెసీఆర్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వంద శాతం జీహెచ్ఎంసీపై ఎగిరేది టీఆర్ఎస్ జెండానే అన్నారు. అదే సమయంలో బిజెపిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ చేసే దుష్ప్రచారంపై ఎక్కడక్కడ తిప్పికొట్టాలన్నారు. బీజేపీ వ్యతిరేక పోరాటం హైదరాబాద్ నుంచే మొదలుపెట్టబోతున్నామని చెప్పారు. డిసెంబర్ రెండో వారంలో బీజేపీ వ్యతిరేక విధానాలపై సదస్సు నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలందరిని ఈ సమావేశానికి ఆహ్వనిస్తామన్నారు. మమతా బెనర్జీ ,కుమార స్వామి ,అఖిలేష్ యాదవ్,స్టాలిన్‌తో పాటు మరికొన్ని పార్టీల నేతలు ఈ సమావేశానికి హాజరవుతారని పేర్కొన్నారు.
బీజేపీపై యుద్ధమే చేస్తానన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 110 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సర్వేలన్నీ తమకు అనుకూలంగా ఉన్నాయని, అభ్యర్థులు, కార్యకర్తలు గట్టిగా ప్రచారం చేయాలని సూచించారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను జనాల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం ఉండాలన్నారు. బీజేపీ విమర్శలను గట్టిగా తిప్పి కొట్టాలని సూచించారు. ఎవరూ కంగారు పడొద్దని, అభ్యర్థుల్లో మార్పులు, చేర్పులు ఉంటాయన్నారు. అందరికి న్యాయం చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ను పట్టించుకోకుండా గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని నేతలకు సూచించారు. వరద సాయానికి బ్రేక్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీనే వరద సాయాన్ని నిలిపేలా చేసిందని ఆరోపించారు. బీజేపీ నేతల ఫిర్యాదు మేరకే ఎన్నికల సంఘం వరద సాయాన్ని నిలిపివేసిందన్నారు. అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వదు అన్నట్లు బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు.