గోవా సీఎం వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు

Update: 2021-07-29 10:54 GMT

గోవా బీచ్ లో జ‌రిగిన గ్యాంగ్ రేప్ కు సంబంధించి ముఖ్య‌మంత్రి ప్ర‌మోద్ సావంత్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. మైన‌ర్ పిల్ల‌లు రాత్రిళ్ళు ఇళ్ల‌కు రాకుండా ఎక్క‌డ ఉంటున్నారో చూసుకోవాల్సిన అవ‌స‌రం త‌ల్లిదండ్రుల‌పై ఉంద‌ని..ఇలాంటి ఘ‌ట‌న‌ల‌పై ప్ర‌భుత్వం, పోలీసుల‌పై నెపం నెట్ట‌డం స‌రికాద‌ని వ్యాఖ్యానించారు. ఈ విష‌యంలో త‌ల్లితండ్రులు ఓ సారి ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకోవాల‌న్నారు. సీఎం వ్యాఖ్య‌ల‌పై గోవాలోని ప్ర‌తిప‌క్ష పార్టీలు మండిప‌డుతున్నాయి. సోష‌ల్ మీడియా లోనూ ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ప‌ది మంది యువతీ, యువ‌కులు గోవాలోని ఓ బీచ్ లో పార్టీ చేసుకున్నారు. అందులో ఇద్ద‌రు అమ్మాయిలు, ఇద్ద‌రు అబ్బాయిలు మాత్రం రాత్రంతా అక్క‌డే ఉండిపోయారు. ఆ స‌మ‌యంలో ఇద్ద‌రు అమ్మాయిల‌పై న‌లుగురు వ్య‌క్తులు గ్యాంగ్ రేప్ చేశారు. అమ్మాయిల‌తో ఉన్న అబ్బాయిల‌పై దాడి చేసి వీరు ఈ అఘాయిత్యానికి పాల్ప‌డ్డారు.

ఈ అంశంపై శాస‌న‌స‌భ‌లో మాట్లాడిన గోవా ముఖ్య‌మంత్రి ప్ర‌మోద్ సావంత్ రాత్రిళ్ళు అంతా బీచ్ ల్లో ఉండొద్ద‌ని యువ‌త‌కు సూచించారు. సీఎం ద‌గ్గ‌రే హోం మంత్రిత్వ శాఖ కూడా ఉంది. ఈ అంశంపై గోవా కాంగ్రెస్ అధికార ప్ర‌తినిధి అల్టోన్ డి కోస్టా మాట్లాడుతూ గోవాలో శాంతి, భ‌ద్ర‌త‌లు దారుణంగా ఉన్నాయ‌ని..నేర‌స్తులు జైల్లో ఉండాల‌ని..చ‌ట్టానికి లోబ‌డి ఉండే వాళ్లు స్వేచ్చ‌గా తిర‌గొచ్చ‌ని వ్యాఖ్యానించారు.గోవా పార్వ‌ర్డ్ పార్టీ ఎమ్మెల్యే కూడా ప్ర‌మోద్ సావంత్ వ్యాఖ్య‌ల‌పై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. విప‌క్ష నేత‌లు అంద‌రూ సీఎం వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఎంతో పేరున్న గోవాలో ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చూడాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వం, పోలీసుల‌దే అన్నారు.

Tags:    

Similar News