కెసీఆర్ అసలు ప్లాన్ అదే!

Update: 2020-11-13 07:20 GMT

జీహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో అధికార టీఆర్ ఎస్ ఎందుకంత హడావుడి పడుతోంది. ఇందుకు కారణం ఒక్కటే. బిజెపికి బ్రీతింగ్ టైమ్ ఇవ్వకుండా ఎన్నికలు పూర్తి చేయాలి. ఎక్కువ సమయం ఇస్తే వార్డుల వారీగా ఆ పార్టీ మరింత ఎక్కువ ఫోకస్ పెడుతుంది. ఆ ఛాన్స్ లేకుండా చేయటమే టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ ప్లాన్. అసలే బిజెపి దుబ్బాక అసెంబ్లీ గెలుపుతో దూకుడులో ఉంది. ఎంత వేగంగా వీలు అయితే అంత వేగంగా ఎన్నికలు పూర్తి చేసి మరోసారి జీహెచ్ఎంసీపై గులాబీ జెండా ఎగరేయాలన్నది టీఆర్ఎస్ ప్లాన్. అందుకే హడావుడిగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను నియమించి..వారితో అమావాస్య రోజు అని కూడా చూడకుండా ప్రమాణ స్వీకారం చేయించాలని యోచిస్తున్నారంటే సర్కారు ఎంత టార్గెట్ తో వ్యవహరిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. మెజారిటీ తగ్గినా కో ఆప్షన్ సభ్యులతో గట్టెక్కాలనే యోచనతోనే ఇంత ఆగమేఘాల మీద ఎమ్మెల్సీల భర్తీ ప్రక్రియను కేబినెట్ లో ఆమోదింప చేయాలని నిర్ణయించారు.

వాస్తవానికి సర్కారు ఇటీవలే వరద బాధితులకు పూర్తి స్థాయిలో సాయం అందజేసి, ఇతర పనులు పూర్తి చేసి తర్వాత అంటే జనవరిలో ఎన్నికలు జరపాలని యోచించింది. సంక్రాంతి తర్వాత ఎన్నికలు అని వార్తలు వచ్చాయి. మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్ కూడా అవసరం అయితే సీఎం కెసీఆర్ ను మరో వంద కోట్ల రూపాయలు అడిగి వరద బాధితులకు సాయం చేస్తామని ప్రకటించారు. వాస్తవానికి ప్రస్తుతం జీహెచ్ఎంసీలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కు అంత అనుకూల వాతావరణం లేదనే చెప్పాలి. దీనికి కారణంగా తాజాగా కురిసిన వర్షాలకు హైదరాబాద్ ఎప్పుడూ లేని రీతిలో వరదలోమునిగింది. దీంతో పలు లోతట్టు ప్రాంతాల ప్రజలు సర్కారు తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. దీంతోపాటు తొలిసారి ఎన్నికైన సందర్భంగా ముఖ్యమంత్రి కెసీఆర్ అసెంబ్లీలో, వెలుపలా హైదరాబాద్ కు సంబంధించి చేసిన ప్రకటనల వీడియోలు సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అసెంబ్లీతోపాటు సెక్రటేరియట్, రాజ్ భవన్ వంటి చోట్ల వర్షాలు వచ్చినా నీరు నిల్వకుండా చేస్తానని ప్రకటించారు.

ఏడాది దాటిపోయింది..ఏడేళ్లు కావస్తోంది కానీ..సీన్ సేమ్. చిన్న వర్షం పడినా సరే నీళ్లు అక్కడ మోకాళ్లదాకా వస్తాయి. అంతే కాదు..పాత బస్తీని ఇస్తాంబుల్ చేస్తానని కెసీఆర్ ప్రకటించారు. ఇస్తాంబుల్ సంగతి ఏమో కానీ..ఎక్కడ వేసిన గొంగళి అన్న చందంగానే అక్కడ కూడా ఉంది. దీంతోపాటు కరోనా సమయంలో సర్కారు నగరంలోని ప్రజలకు సరైన రీతిలో కరోనా టెస్ట్ ల సౌకర్యం కల్పించలేదనే విమర్శలు ఎదుర్కొంది. దీంతోపాటు ప్రైవేట్ ఆస్పత్రులను వారి ఇష్టారాజ్యానికి వదిలేయటంతో ఆస్పత్రులు కూడా ప్రజల నుంచి లక్షల రూపాయల మేర ఫీజులు దండుకున్నాయి. ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా సర్కారు ఇంత ఆగమేఘాల మీద రెడీ అవుతుంది అంటే జాప్యం చేసే కొద్దీ బిజెపికి మరిన్ని ఛాన్స్ లు ఇచ్చినట్లు అన్న ఉద్దేశంతోనే ఈ స్పీడ్ అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News