గంటా ఎక్క‌డ‌?. విశాఖ ఉక్కు ఉద్య‌మం అంతేనా?

Update: 2021-07-05 07:45 GMT

విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మం నిర్మిస్తాన‌ని చెప్పిన మాజీ మంత్రి, విశాఖ‌ప‌ట్నం నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎక్క‌డ‌?. ఆయ‌న చేసిన రాజీనామా కూడా ఇక అంతేనా?. ఓ వైపు కేంద్రం విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌కు వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. తొలుత ఈ అంశంపై హంగామా చేసిన గంటా హైద‌రాబాద్ వ‌చ్చి మ‌రీ తెలంగాణ మంత్రి కెటీఆర్ ను విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మంలో పాల్గొనేందుకు ఆహ్వానించారు. అంత‌కు ముందే కెటీఆర్ కూడా ఓ బ‌హిరంగ స‌భ‌లో ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా రెండ‌వ ద‌శ చాలా వ‌ర‌కూ త‌గ్గి సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. ఎవ‌రి పనుల్లో వారు ప‌డిపోతున్నారు.

కానీ రాజ‌కీయాల‌కు అతీతంగా అంద‌రూ ముందుకు రావాల‌ని..ఐక్య కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిద్దామ‌ని ప‌దే ప‌దే పిలుపునిచ్చిన గంటానే విశాఖ ఉక్కు అంశాన్ని వ‌దిలేశారా?. తొలుత ఉత్తుత్తి రాజీనామా చేసిన గంటా శ్రీనివాస‌రావు దీనిపై వచ్చిన విమ‌ర్శ‌ల‌తో త‌ర్వాత స్పీక‌ర్ ఫార్మాట్ లో రాజీనామా పంపారు. ఫిబ్ర‌వ‌రి 12న స్పీక‌ర్ ఫార్మాట్ లో రాజీనామా చేశారు. కానీ అది ఇంత వ‌ర‌కూ ఆమోదం పొంద‌లేదు. ఆమోదం కోసం ఆయ‌న గ‌ట్టిగా ప్ర‌య‌త్నించిన దాఖ‌లాలు కూడా క‌న్పించ‌టం లేదు. పోనీ ఆయ‌న ఏమైనా నియోజ‌క‌వ‌ర్గంలో అయినా చురుగ్గా ప‌ర్య‌టిస్తూ ప్ర‌జ‌ల సాధ‌క‌బాధ‌కాలు చూస్తున్నారా అంటే అది కూడా లేద‌ని టీడీపీ వ‌ర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. అదే స‌మ‌యంలో గంటా పార్టీ కార్య‌క్ర‌మాల విష‌యంలోనూ ఆయ‌న అంటీముట్ట‌న‌ట్లే వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Tags:    

Similar News