సెలబ్రిటీల ట్వీట్లపై విచారణ

Update: 2021-02-08 10:09 GMT

మహారాష్ట్ర సర్కారు సంచలనం

వాళ్ళాంతా సెలబ్రిటీలు. కానీ చాలా మంది ట్వీట్లు అన్నీ ఒకేలా ఉన్నాయి. ప్రారంభం నుంచి ముగింపు వరకూ ఒక్క అక్షరం కూడా మారలేదు. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో ఆ సెలబ్రిటీలు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు కూడా. అందరి తరపున ఒకరే ట్వీట్ చేశారా అంటూ నెటిజన్లు వ్యంగాస్త్రాలు సంధించారు. ఇప్పుడు ఈ వ్యవహారంపై మహారాష్ట్ర సర్కారు ఏకంగా విచారణకు ఆదేశించటం కలకలం రేపుతోంది. అసలు దీని వెనక కథ ఏంటి అని తేల్చే పనిలో మహారాష్ట్ర సర్కారు నిమగ్నమైంది. దేశంలో కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న ఆందోళనకు మద్దతుగా పాప్‌ సింగర్‌ రిహానే, పర్యవరణ ఉద్యమకారిణి గ్రేటా థన్‌బర్గ్‌, మియా ఖలిఫా వంటి వారు ట్వీట్లు చేశారు. దీనిపై పెద్ద దుమారమే రేగింది. కేంద్ర మంత్రులతోపాటు మరికొంత మంది ఈ ట్వీట్లకు కౌంటర్ ఇస్తూ రంగంలోకి దిగారు. అంతే కాదు..ఎప్పుడూ ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై స్పందించిన చాలా మంది అకస్మాత్తుగా తెరపైకి వచ్చారు.

అందులో సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లి, అక్షయ్‌కుమార్‌, అజయ్ దేవ్ గన్, వంటి వారు ట్వీట్‌ చేశారు. దేశ అంతర్గత సమస్యలను తామే పరిష్కరించుకోగలమని..ఇందులో విదేశీయుల జోక్యం అవసరం లేదంటూ పేర్కొన్నారు. ఇలాంటి ప్రముఖులు చేసిన ట్వీట్లపై దర్యాప్తు జరుతామని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ప్రకటించడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఒకే విధమైన ట్వీట్స్‌ చేయడం పలు అనుమానాలకు తావిస్తోందని, దీనిపై మహారాష్ట్ర ఇంటిలిజెన్స్‌ సంస్థలు దర్యాప్తు జరుపుతామని సోమవారం అనిల్‌ దేశ్ ముఖ్ ప్రకటించారు. వరుస ట్వీట్స్‌ వెనుక కేంద్ర ప్రభుత్వం లేదా ఇతర వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు జరపనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

Tags:    

Similar News