కమలం పరిగెట్టింది..కారు ఆగింది
23865 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన ఈటెల
వేల కోట్ల రూపాయల దళితబంధు ఆదుకోలేదు. వందల కోట్ల అనదికార ఖర్చు ఉపయోగపడలేదు. హుజూరాబాద్ ఓటర్లు అధికార టీఆర్ఎస్ కారుకు 'ఇంధనం' నింపలేదు. దీంతో కారు అక్కడే ఆగిపోయింది. కమలం పరిగెట్టింది. అభివృద్ధి అంటే టీఆర్ఎస్.టీఆర్ఎస్ అంటే అభివృద్ధి అంటూ అధికార పార్టీ ఎన్ని చెప్పినా ప్రజలు మాత్రం ఈ వాదనను విశ్వసించలేదు. అభివృద్ధివాదం కంటే ఆత్మగౌరవ నినాదానికే హుజూరాబాద్ ప్రజలు పట్టంకట్టారు. కౌంటింగ్ ప్రారంభం అయ్యాక తొలి రౌండ్ నుంచి బిజెపి తరపున బరిలో నిలిచిన ఈటెల రాజేందర్ తన ఆధిక్యత చూపిస్తూ పోయారు. దీంతో ఫలితం ఎలా ఉండబోతుందో తేలిపోయింది. మొత్తం 22 రౌండ్లలో కేవలం రెండు సార్లు మాత్రమే టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాసయాదవ్ స్వల్ప ఆధిక్యత చూపించారు. ఆ తర్వాత ఎక్కడా ఈటెల జోరు ఆగలేదు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై అధికార టీఆర్ఎస్ భూ కబ్జా, అవినీతి ఆరోపణలు చేసినా అవేమీ కూడా ఆయన విజయాన్ని ఆపలేకపోయాయి. బహుశా పార్టీ ఆవిర్భావం తర్వాత ఏ ఉప ఎన్నికకు కూడా టీఆర్ఎస్ ఇంతగా కష్టపడినట్లు లేదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది.
ఈటెల రాజేందర్ ను హుజూరాబాద్ లో ఓడించటం ద్వారా టీఆర్ఎస్ నుంచి బయటికి వెళితే ఎవరైనా అంతే అనే సంకేతాలు ఇవ్వాలని టీఆర్ఎస్ అధిష్టానం విశ్వప్రయత్నాలు చేసింది. అయితే ఈ ప్రయత్నాలను వమ్ము చేసి సీఎం కెసీఆర్ కు ఛాలెంజ్ చేసి మరీ ఈటెల రాజేందర్ విజయం సాధించారు. ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్‌రావు పూర్తిగా హుజూరాబాద్ లోనే మకాం వేసి ఈటెల రాజేందర్ ను ఓడించేందుకు గల మార్గాలు అన్నింటిని వాడేశారు. అయినా సరే ఫలితం సాధించలేకపోయారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ నిజం అయ్యాయి. ఇవి అంచనా వేసినట్లే బిజెపి అభ్యర్ధిగా బరిలో నిలిచిన ఈటెల రాజేందర్ 23865 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. అధికార పార్టీ వ్యూహాలను ఎదుర్కొని...తట్టుకుని నిలబడి గెలవటమే ఓ సంచలనం అయితే..ఏకంగా 23865 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించటం ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఓ రికార్డుగానే భావించాలి.