ఎన్నిక‌లు వ‌చ్చిన చోటే కెసీఆర్ వ‌రాలు

Update: 2021-06-09 11:24 GMT

ముఖ్య‌మంత్రి కెసీఆర్ పై మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ‌త రెండు రోజులుగా హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న బుధ‌వారం నాడు మీడియాతో మాట్లాడారు. ఉపఎన్నిక వస్తుందంటే అక్కడ కేసీఆర్‌ వరాలు ప్రకటిస్తారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ భృతి హామీ ఏమైందని కెసీఆర్ ను ప్రశ్నించారు. తన రాజీనామాతో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నార‌ని, అలాగే రెండేళ్లుగా నిలిచిపోయిన కొత్త పెన్షన్లు, తెల్లరేషన్ కార్డులు కూడా వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని వావిలాల, చల్లూరు కొత్త మండలాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ కుట్రలను హుజూరాబాద్ ప్రజలు తిప్పికొడతారని విమర్శించారు. నాయకుడంటే అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల హృదయాల్లో నిలిచి పోవలసి వస్తుందని హితవు పలికారు.ఈ మేరకు ఇల్లందకుంటలో ఈటల రాజేందర్‌ బుధవారం పర్యటించారు. గతంలో హుజూరాబాద్ జిల్లా కావాలని కోరినట్లు గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సౌలభ్యం కోసం కొత్త మండలాలతో పాటు జిల్లా ఏర్పాటు అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు.ఎక్కడ ఉప ఎన్నిక వచ్చిన వరాల జల్లు కురిపించే సీఎం కేసీఆర్, హుజురాబాద్‌కు విరివిగా నిధులు, పనులు మంజూరు చేయాలని ఈటెల డిమాండ్‌ చేశారు.

చిన్న గ్రామాలకు 50 లక్షలు, పెద్ద గ్రామాలకు కోటి రూపాయల చొప్పున వెంటనే మంజూరు చేయాలని పేర్కొన్నారు. నంగనాచి మాటలతో నియోజకవర్గ ప్రజలను ప్రలోభ పెడుతున్నారని, రాజభక్తి చాటుకుంటే చాటుకొని కానీ తనపై విమర్శలు చేస్తే ప్రజలు ఊరుకోరని అన్నారు. ప్రభుత్వం ప్రకటించే తాయిలాలకు డబ్బు సంచులకు ప్రజలు లొంగరని, ప్రజల గుండెల్లో తాను ఉన్నానని ఈటెల పేర్కొన్నారు. ధర్మ యుద్ధం కురుక్షేత్రం జరుగుతుందని, ఆనాడు పాండవులు గెలిచినట్లు రాబోయే ఉప ఎన్నికలో హుజూరాబాద్ ప్రజలు గెలుస్తారని అన్నారు. పిడికెడు మంది కల్లబొల్లి మాటలు చెప్పినా, హుజూరాబాద్ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని హెచ్చరించారు. భావజాలం, ఆత్మ గౌరవం ఎవరికీ ఉందో హరీష్ రావే చెప్పాలన్నారు.

Tags:    

Similar News