రోజుకో కొత్త అంశం తెరపైకి వస్తోంది. తాజాగా ఈ పదాలు పార్లమెంట్ లో వాడకూడదు అంటూ కొన్ని పదాలతో బుక్ లెట్ లో విడుదల చేశారు. దీనిపై రాజకీయంగా దుమారం రేగటంతో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా దీనిపై వివరణ ఇచ్చారు. అభ్యంతకర పదాలు ఎవరైనా వాడితే వాటిని రికార్డుల నుంచి తొలగిస్తామన్నారు. తాజాగా పార్లమెంట్ ఆవరణలో ధర్నాలు. నిరసన ప్రదర్శనలకు అనుమతి లేదంటూ రాజ్యసభ సెక్రటేరియట్ ఓ సర్కులర్ జారీ చేసింది. రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీ సీ మోడీ పేరుతో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.
ధర్నా, నిరసన, సమ్మె, నిరహారదీక్ష, మతపరమైన కార్యక్రమాలకు ఈ ప్రాంగణాన్ని ఉపయోగించరాదంటూ పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. విశ్వ గురు నుంచి మరో ఆయుధం వచ్చింది..ధర్నాలు నిషేధం అంట అంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఈ నిర్ణయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వ్యాఖ్యానించారు. పలు పార్టీ లు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు వ్యతిరేకిస్తూ సభా ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద మౌన ప్రదర్శనలు..నిరసనల తెలియజేస్తుంటాయి. ఇది ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయం. ఇప్పుడు దానికి బ్రేక్ లు వేశారు.