కెసీఆర్ ను ఓడించకపోతే నా జన్మకు సార్ధకత లేదు
మాజీ మంత్రి, బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను గజ్వేల్ లో పోటీచేస్తానంటే బానిసలతో తిట్టిస్తున్నారని..సరే హుజూరాబాద్ కు రండి తేల్చుకుందాం అని సవాల్ విసిరారు. కెసీఆర్ ను ఓడించకపోతే తన జన్మకు సార్ధకత ఉండదని కీలక వ్యాఖ్యలు చేశారు. కెసీఆర్ తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయారని..ఆయనకు పాలించే అర్హత లేదన్నారు. దళిత బిడ్డలకు ఇచ్చిన అసైన్ మెంట్ భూములను లాక్కుని..వారికి గజాల స్థలం ఇస్తామని బేరాలు పెడుతున్నారని..సీఎం కెసీఆర్..ప్రభుత్వం బ్రోకర్ గా పనిచేస్తోందని ఆరోపించారు.
పేదల భూములు లాక్కుని బడా బాబులకు అప్పగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. నిజంగా మీకు దళితులపై ప్రేమ ఉంటే వారికి గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములు లాక్కుంటారా అని ప్రశ్నించారు. ఈ అంశంపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. స్వతంత్రంగా ఆలోచించే వారిని కెసీఆర్ సహించరని అన్నారు. 2018 ఎన్నికల్లో తనతోపాటు మరికొంత మందిని ఓడించాలని చూశారని..కానీ తన విషయంలో మాత్రం ఫెయిన్ అయ్యారని చెప్పారు. హుజూరాబాద్ ఎన్నికల్లో తనను ఓడించేందుకు చేయని ప్రయత్నం లేదని..అయినా సరే ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టారన్నారు.