అహ్మద్ పటేల్ మృతి

Update: 2020-11-25 04:19 GMT

యూపీఏ హయాంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ ఇక లేరు. గత కొంత కాలంగా ఆయన పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి తోడు కరోనా కూడా ఎటాక్ కావటంతో మరిన్ని సమస్యలు చుట్టుముట్టాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే బుదవారం తెల్లవారుజామును అహ్మద్ పటేల్ తుది శ్వాస విడిచారని ఆయన తనయుడు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు. కరోనా బారిన పడి పలు అవయవాలు దెబ్బతినడంతో అహ్మద్ పటేల్ కన్నుమూశారని పేర్కొన్నారు.

తాను కరోనా బారిన పడినట్లు అహ్మద్ పటేల్ అక్టోబర్ 1న ట్విటర్ ద్వారా తెలిపారు. అనంతరం నవంబర్ 15న ఆసుపత్రిలో చేరారు. కొద్ది రోజులుగా ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. నెలరోజుల పాటు కరోనాతో పోరాడినా ప్రాణాలు కాపాడలేకపోయారు. కీలక సమయంలో ఆయన సోనియాగాంధీకి రాజకీయ సలహాదారుగా వ్యవహరించారు. అహ్మద్ పటేల్ మృతిపై ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీలు విచారం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News