తెలంగాణలో రాజకీయంగా అత్యంత ఉత్కంఠ రేపుతున్నది హుజూరాబాద్ ఉప ఎన్నిక. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాసయాదవ్ నామినేషన్ వేయగా..బిజెపి నుంచి బరిలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ నిలవనున్న విషయం తెలిసిందే. పలు ఆలోచనల తర్వాత మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్ శనివారం నాడు తన అభ్యర్ధిని ప్రకటించింది. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ నర్సింగ్ రావుని తమ అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఏఐసీసీ బల్మూరి వెంకట్ పేరుని అధికారికంగా వెల్లడిస్తూ ప్రకటన విడుదల చేసింది. తొలుత కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కొండా సురేఖను బరిలో నిలపాలని యోచించింది. అయితే ఆమె పలు డిమాండ్లు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. దీంతో పార్టీ చివరకు వెంకట్ కు ఛాన్స్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో గత కొన్ని రోజులుగా సాగుతున్న సస్పెన్స్ కు తెరపడినట్లు అయింది.
అయితే ప్రధాన పోటీ మాత్రం అధికార టీఆర్ఎస్, బిజెపిల మధ్యే అన్న విషయం తెలిసిందే. అయితే కొత్త అభ్యర్ధితో కాంగ్రెస్ ఏ మేరకు తన సత్తా చాటుతుందో వేచిచూడాల్సిందే. ఇప్పటివరకూ ఆ పార్టీ హుజూరాబాద్ పై పెద్దగా ఫోకస్ పెట్టిన దాఖలాలు లేవు. మరి అభ్యర్ధిని ప్రకటించిన తర్వాత అయినా టీపీసీసీ హుజూరాబాద్ పై ప్రత్యేక ఫోకస్ పెడుతుందా లేక ఈ ఎన్నికను లైట్ తీసుకుంటుందా అన్నది వేచిచూడాల్సిందే. హూజురాబాద్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు తీసుకురావచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీకి కూడా గెలుపు సంగతి ఎలా ఉన్నా ఓట్ల విషయంలో అయినా తన సత్తాను చాటుకోవాల్సిన అవసరం ఉంది.