గత కొంత కాలంగా అసమ్మతి స్వరం విన్పిస్తున్న కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి అధిష్టానం ఝలక్ ఇచ్చింది. ప్రతి విషయంలోనూ ఆయన టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. గతంలో పార్టీ వ్యవహారాలు ఏమీ బహిరంగంగా మాట్లాడనని హామీ ఇచ్చిన జగ్గారెడ్డి దీన్ని ఎక్కువ రోజులు నిలుపుకోలేదు. కాంగ్రెస్ కు కాస్త అనుకూల వాతావరణం ఏదైనా వస్తుంది అంటే ఎవరో ఒకరు రంగంలోకి దిగి దాన్ని చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తీరు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల్లో కూడా అసహనాన్ని పెంచుతోంది. ఈ తరుణంలో అధిష్టానం కదిలినట్లు కన్పిస్తోంది. జగ్గారెడ్డికి అదనంగా ఉన్న పార్టీ బాధ్యతలను టీపీసీసీ తొలగించింది.పార్లమెంట్ నియోజక వర్గాల బాధ్యతలు, అనుబంధ సంఘాల బాధ్యతల నుంచి ఆయనను టీపీసీసీ తప్పించింది.
స్వతంత్రంగా ఉంటానని గతంలో హైకమాండ్‌కు జగ్గారెడ్డి లేఖ రాశారు. ఆదివారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. ఆయన పార్టీ లైన్‌లో పనిచేయడంలేదన్నారు. కాంగ్రెస్ ను గెలిపించే శక్తి రేవంత్‌కు ఉంటే.. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని, సంగారెడ్డిలో పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెట్టి గెలిపించాలని సవాల్ విసిరారు. అప్పుడు రేవంత్‌రెడ్డే హీరో అని తాను ఒప్పుకొంటానన్నారు. తాను గెలిస్తే తానే హీరోనన్నారు. ఒకవేళ ఇద్దరమూ ఓడిపోతే ఇద్దరమూ జీరోలమేనన్నారు.