ఎందుకో ఈ మార్పు. ఈ మధ్య కాలంలో ఎవరూ ఊహించని మార్పు. ఢిల్లీలో ఏదో జరుగుతుంది. అది ఏంటి అన్నదే తేలాల్సి ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ మళ్లీ ఢిల్లీ వెళ్తుతున్నారు. ఇటీవలే ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేయటానికి వెళ్లిన కెసీఆర్ షెడ్యూల్ లో లేకపోయినా చాలా రోజులు అక్కడే మకాం వేసి పలువురు కేంద్ర మంత్రులతో వరస భేటీలు నిర్వహించారు. మళ్ళీ ఇప్పుడు మరో దఫా కెసీఆర్ ఢిల్లీ పర్యటనకు బయలుదేరటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిరేపుతోంది. గతంలో స్వయంగా ప్రధాన మంత్రి నిర్వహించిన కీలక సమావేశాలకు కూడా మంత్రులను పంపి మమ అన్పించిన సందర్భాలు ఉన్నాయి. సీఎంల సమావేశాలకు కూడా కెసీఆర్ దూరంగా ఉన్నారు. అలాంటిది ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు,,మరో వైపు హుజూరాబాద్ ఉప ఎన్నిక టెన్షన్, మరో వైపు దళితబంధుతోపాటు పలు కార్యక్రమాలకు నిధుల కొరత వంటి కీలక అంశాలు ఉన్నాయి. ఈ తరుణంలో కెసీఆర్ ఢిల్లీ పర్యటన పూర్తిగా అధికారిక కార్యక్రమాలేనా? లేక దీని వెనక ఏమైనా ఇతర కారణాలు ఏమైనా ఉన్నా అన్న చర్చ సాగుతోంది. ఈ నెల 26 న విజ్జాన్ భవన్ లో కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిర్వహించే సమావేశంలో సీఎం కెసీఆర్ పాల్గొనననున్నారు. అనంతరం ధాన్యం కొనుగోలు అంశం పై కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ తో మాట్లాడుతాడరని,. అదే రోజు సాయంత్రం హైద్రాబాద్ తిరుగు ప్రయాణం అవుతారని చెబుతున్నారు. దీని కోసం సీఎం కెసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.
ఈనెల 25 న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షకావత్ తో సమావేశం అవుతారు. వాస్తవానికి మొన్నటి పర్యటనలో కూడా షెకావత్ తో సీఎం కెసీఆర్ సమావేశం అయ్యారు. మరోసారి కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో భేటీ కూడా ప్రాధాన్యత సంతరించకోనుంది. గత కొంత కాలంగా బిజెపి, టీఆర్ఎస్ ల మధ్య సంబంధాలు మెరుగవుతున్నాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తాజాగా నిర్మల్ లో పర్యటించిన కీలక బిజెపి నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా గతంతో పోలిస్తే సీఎం కెసీఆర్ పై పెద్దగా విమర్శలు చేసిన దాఖలాలు లేవు. భవిష్యత్ లో మారే సమీకరణలకు అనుగుణంగా అటు ఏపీలో జగన్ , ఇటు తెలంగాణలో కెసీఆర్ తో బిజెపి అంతర్గతంగా సత్సంబంధాలను కొనసాగిస్తుందనే చెబుతున్నారు. గతంలో అసలు బిజెపికి పాలించటమే రాదు..సమస్యలు పరిష్కరించటమే రాదు అన్న కెసీఆర్ ఇప్పుడు మాత్రం ఆ మాట ఎత్తటం లేదు. కేంద్రంతో ఇక యుద్ధమే అన్న ఆయన అస్త్రాలు అన్నీ పక్కనపడేశారు.