తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై బిజెపి నాయకురాలు విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కన్నా కెసీఆర్ గొప్ప నటుడు అన్నారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని మోసం చేశారని విమర్శించారు. 'తనకన్నా బలమైన నేతలెవరూ ఉండకూడదనేది ఆయన ఆలోచన. కేసీఆర్‌లా మాట మార్చడం నాకు రాదు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది చనిపోయారు. వాళ్ల శవాల మీద కూర్చుని కేసీఆర్ పరిపాలిస్తున్నారు. కేసీఆర్ ఎన్నడూ తెలంగాణ ప్రజలను ప్రేమించలేదు. ఆయనకు డబ్బులే ముఖ్యం. ఏం చేసుకుంటారు దొర డబ్బుని.
ఎల్లకాలం అబద్ధాలతో మోసం చేయలేరు. తెలంగాణ ప్రజల్లోనూ మార్పు వస్తోంది. కేసీఆర్‌కు దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు బాగా బుద్ధి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది. అరాచక ప్రభుత్వాన్ని గద్దె దింపి, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి' అని విజయశాంతి కోరారు. బిజెపిలో చేరిన అనంతరం తొలిసారి రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. 2023లో కేసీఆర్‌ను గద్దె దించడం ఖాయమని స్పష్టం చేశారు.