జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కృతజ్ఞతలు కూడా తెల‌ప‌రా?

Update: 2021-09-19 14:56 GMT

ఏపీ స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో అధికార వైసీపీ ఘ‌న విజ‌యం సాధించింది. స‌హ‌జంగా ఇంత‌టి భారీ విజ‌యాన్ని సాధించిన పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి ఎన్నిక‌ల్లో అప్ర‌తిహ‌త విజ‌యాన్ని అందించిన ఓట‌ర్ల‌కు..ప్ర‌జ‌ల‌కు అభినంద‌న‌లు తెలుపుతారు. స‌హ‌జంగా ఇది ఎక్క‌డైనా జ‌రిగేదే. మీడియా ముందుకు రావ‌టం ఇష్టం లేక‌పోతే క‌నీసం ఓ ప్ర‌క‌ట‌న అయినా విడుద‌ల చేస్తారు. కానీ అందుకు భిన్నంగా సీఎం జ‌గ‌న్ తర‌పున వ్య‌క్తిగ‌తంగా, పార్టీ త‌ర‌పున ప్ర‌జ‌ల‌కు కృతజ్ఞతలు తెలుపుతున్న‌ట్లు వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ప్ర‌క‌టించారు. ప‌లితాల వెల్ల‌డి అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అందులో ఆయ‌న సీఎం జ‌గ‌న్ పాల‌న‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. ఈ రెండున్న‌రేళ్ల పాల‌న జ‌గ‌న్మోహ‌నంగా ఉంద‌న్నారు. పరిషత్‌ ఎన్నికల్లో అపూర్వ విజయం అందించిన ప్రజలకు పార్టీ, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తరఫున రాష్ట్ర ప్రజలందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్ర‌క‌టించారు. టీడీపీ కార్యకర్తగా పనిచేసిన నిమ్మగడ్డ, కోర్టులకు వెళ్లి ఇబ్బంది పెట్టిన చంద్రబాబుకి కూడా కృతజ్ఞతలు. ఏ రాజకీయ పార్టీ వ్యవహరించని రీతిలో టీడీపీ డాంభికాన్ని ప్రదర్శిస్తోంది. అచ్చెన్న దమ్ముంటే ఎన్నికలు పెట్టండి.. అంటున్నాడు.. 2019లో బొక్కబోర్లా పడ్డా బుద్ధి రాలేదు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండాలనే పరిస్థితి కూడా లేదు.

జగన్‌మోహన్ రెడ్డి పదేళ్లుగా పరిశీలించి ఏ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలో కొత్త ప్రయోగం చేస్తున్నార‌ని తెలిపారు. బడుగుల జీవితాల్లో వెలుగు నింపడానికి చేస్తున్న కృషికి ప్రజలు శభాష్ అని తీర్పు ఇచ్చారు. విశ్వసనీయత నచ్చితే ప్రజలు ఎలా అక్కున చేర్చుకుంటారో స్పష్టంగా కనిపించింది. కొన్ని పార్టీలు గుణపాఠాలు నేర్చుకోవడానికి కూడా ఈ ఫలితాలు ఉపయోగపడతాయ‌న్నారు. '2020లో మొదలైన ఈ ఎన్నిక‌ల‌ ప్రక్రియ 2021 సెప్టెంబర్ 19వ తేదీన ముగియడం వారి పుణ్యమే. 2018లో జరగాల్సిన ఎన్నికలు ఇవి జనం ఛీ కొడతారని చంద్రబాబు ఎన్నికలు పెట్టలేదు. 2014లో వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలకు మేము చంద్రబాబులా భయపడలేదు. ఎన్నికల ప్రక్రియ మొదలై ప్రజల్లో స్పందన చూసి వాళ్లకి దిక్కు తెలియలేదు. అభ్యర్థుల భవిష్యత్తును వీరి దుర్మార్గపు కుట్రల వల్ల ఇబ్బంది పెట్టారు. మీరు పదిసార్లు వాయిదా వేసినా మళ్లీ మేమే వస్తామని ఆనాడే చెప్పాం. ఏ రకంగా ప్రజలకు దగ్గర కావాలో తెలుసుకోకుండా కుట్రలపై కుట్రలు చేశారు' అని సజ్జల విమ‌ర్శించారు. అయితే పార్టీ అధినేత‌, సీఎంగా ఓట్లు వేసిన ప్ర‌జ‌ల‌కు అభినంద‌న‌లు చెప్ప‌టానికి జ‌గ‌న్ కు అడ్డుప‌డే అంశాలు ఏమి ఉంటాయ‌ని ఓ సీనియ‌ర్ నేత వ్యాఖ్యానించారు. ఇది ప్ర‌జ‌ల‌కు..క్యాడ‌ర్ కు త‌ప్పుడు సంకేతాలు పంపుతుంద‌ని..విజ‌యంపై ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసినా స‌రిపోతుంది క‌దా అని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

Tags:    

Similar News