వైసీపీ సర్కారుపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. ప్రశాంతతకు మారుపేరైన ఉత్తరాంధ్రపై పగబట్టి హింసా విధ్వంసాలు చేస్తున్నారన్నారని ఆరోపించారు. రామతీర్ధం సంఘటనలో తనపై, కళా వెంకట్రావుపై, అచ్చెన్నాయుడిపై కూడా తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ ను చంద్రబాబు నాయుడు ఖండించారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ జగన్ రెడ్డి కక్ష సాధింపునకు పరాకాష్ట అన్నారు. ఉత్తరాంధ్రపై జగన్ కక్ష కట్టారని... అందుకే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలలో భయోత్పాతం సృష్టిస్తున్నారని ఆరోపించారు. నిమ్మాడలో గత 40ఏళ్లలో ఏనాడూ ఇలాంటి ఉద్రిక్తతలు లేవన్నారు.
ప్రశాంత గ్రామంలో ఉద్రిక్తతలు సృష్టించింది ఎవరు..? దువ్వాడ శ్రీనివాస్ స్వగ్రామానికి అచ్చెన్నాయుడు వెళ్లాడా..? అని ప్రశ్నించారు. అచ్చెన్న స్వగ్రామానికి దువ్వాడ వచ్చి ఘర్షణలు రెచ్చగొట్టారా..? అని ప్రశ్నిస్తూ వాటికి సంబంధించి ఫోటోలు, వీడియోలే సాక్ష్యాధారాలని బాబు పేర్కొన్నారు. దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు పెట్టకుండా అచ్చెన్నాయుడుపై తప్పుడు కేసు పెట్టడం గర్హనీయమని విమర్శించారు. ''ఐపీసీలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లు పెడతారా..? అయినా అచ్చెన్నాయుడిపై మీ కసి తీరలేదా..?'' అంటూ ప్రశ్నించారు.