రాజ‌కీయ‌మే చంద్ర‌బాబు ఏజెండా

Update: 2021-11-19 10:01 GMT

అసెంబ్లీ నుంచి తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడి వాకౌట్ పై సీఎం జ‌గ‌న్ స్పందించారు. చంద్రబాబు సంబంధంలేని విషయాలు తీసుకువచ్చి.. స‌భ‌లో రెచ్చగొట్టార‌న్నారు. విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా.. దేవుడి ఆశీస్సులు.. ప్రజల దీవెనలు ఉన్నంత కాలం త‌మ‌ను ఎవ‌రూ కూడా అడ్డుకోలేర‌ని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, టీడీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నార‌ని విమ‌ర్శించారు. ప్రజలు ఎలా పోయినా చంద్రబాబుకు పట్టద‌ని, తన రాజకీయ అజెండానే ఆయనకు ముఖ్యం అని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ వ్యాఖ్య‌లు ఆయ‌న మాట‌ల్లోనే...''ప్రతీ అంశాన్ని చంద్రబాబు రాజకీయం చేస్తారు. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారనే విషయం రాష్ట్ర ప్రజలందరికి తెలుసు. నేను సభలోకి వచ్చేసరికి చంద్రబాబు ఎమోషనల్‌గా మాట్లాడుతున్నారు. కుప్పం ప్రజలు కూడా చంద్రబాబును వ్యతిరేకించారు. శాసనమండలిలో కూడా టీడీపీ బలం పూర్తిగా పడిపోయింది. మండలి ఛైర్మన్‌గా దళితుడు, నా సోదరుడు మోషేన్‌రాజు ఈ రోజు బాధ్యతలు తీసుకుంటున్నారు. సభలో చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి ప్రస్తావన లేదు. మా అమ్మ, చెల్లెలు, బాబాయ్‌ గురించి చంద్రబాబే మాట్లాడారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లాంటి మీడియా వ్యవస్థలు నాకు లేవు.

తప్పుడు వార్తలు పదేపదే చెప్తే నిజం అవుతుందని అనుకుంటున్నారు. చంద్రబాబు కళ్లల్లో నీళ్లు లేకపోయినా నీళ్లు వచ్చాయని డ్రామా చేశారు' అని తెలిపారు. ''మా చిన్నాన్న గురించి చంద్రబాబు మాట్లాడతాడు.. నా నాన్న తమ్ముడు నా చిన్నాన్న. ఒక కన్ను మరో కన్నును ఎందుకు పొడుచుకుంటుంది. నా చిన్నాన్నను ఎవరైనా ఏదైనా చేసుంటే వారే చేసుండాలి. వంగవీటి రంగ హత్య, మాధవరెడ్డి హత్య, చంద్రబాబు హయాంలోనే జరిగాయి. మల్లెల బాబ్జీ తన సూసైడ్‌ నోట్‌లో కూడా రాశారు'' అని సీఎం జగన్ అన్నారు. వ్యవసాయంపై సభలో చర్చ సందర్భంగా విపక్షాలు లేకపోవడం బాధాకరం. ప్రతిపక్షం అంటే సూచనలు, సలహాలు ఇవ్వాలి. రైతు సంక్షేమం కోసం చాలా పథకాలు తీసుకువచ్చాం. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. గత ప్రభుత్వం మహిళలు, రైతులకు ఇచ్చిన హామీలను నేరవేర్చలేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిని నేరవేర్చాం'' అని సీఎం జగన్‌ తెలిపారు.

Tags:    

Similar News