వైసీపీ నేతలు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఢిల్లీ పర్యటనపై నేతలు వరస పెట్టి మీడియా సమావేశాలు పెట్టి ఎటాక్ చేశారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు మంగళవారం నాడు చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేసారు. చంద్రబాబుకు చిన్న మెదడు చిట్లినట్టుందని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు డ్రగ్స్ వాడుతున్నాడా అనే అనుమానం ఉందన్నారు. చంద్రబాబుకు నార్కో పరీక్ష చేయాలని విప్ శ్రీనివాసులు డిమాండ్ చేసారు. అధికార దాహంతో, అధికార మదంతో ఢిల్లీకి వెళ్లి ఆర్టికల్ 356 అమలు చేయాలంటున్నారని మండిపడ్డారు. జగన్‌పై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో డ్రగ్స్ అంటూ విషాన్ని కక్కుతున్నారన్నారు. వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బద్వేల్ ఉపఎన్నికలో బీజేపీని చంద్రబాబు వెనుక ఉండి నడిపిస్తున్నారని విప్ కొరముట్ల శ్రీనివాసులు ఆరోపించారు. ఏపీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ కేవలం తన రాజకీయాల కోసం ఢిల్లీ వీధుల్లో రాష్ట్ర ప్రజల ఖ్యాతిని చంద్రబాబు తగ్గిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు ఉన్నట్లు ఢిల్లీ వీధుల్లో చెప్తున్నారు.
ఇలాంటి తప్పుడు ప్రచారం వల్ల ఇతర రాష్ట్రాలు ఏమనుకుంటాయి. మీరు తిట్టిన తిట్లు వాళ్లకి గుర్తు ఉండవా..?. అని ప్రశ్నించారు. 'రాష్ట్రపతి రాజధాని గురించి అడిగితే నాశనం చేశారని చెప్పారట. పదేళ్ల హక్కును వదిలేసి ఇక్కడికి పారిపోయి వచ్చి మేమేదో నాశనం చేశామని చెప్పారట. మీ రియల్ ఎస్టేట్ అవసరాల కోసం మూడు రాజధానులు అడ్డుకుని మాపై నిందలా?. దిగజారుడు రాజకీయాలు చేసి ఢిల్లీ వీధుల్లో డ్రామాలు చేస్తున్నారా?. పార్టీ బతికుందని చెప్పుకునే ప్రయత్నం కాదా?. పుస్తకాల్లో పేర్లు రాసుకోవడం కాదు మా కార్యకర్తపై చెయ్యి వేసి చూడండి. ఈ డ్రామాలన్నీ మోదీ, అమిత్ షాలకు తెలుసు. వాళ్లకి ఇక్కడి వాస్తవ పరిస్థితులు తెలియవా? ఆయన మాట్లాడిన మాటలు వాళ్లకు తెలియదా..?. తప్పకుండా ఎన్నికల కమిషన్‌కు పిర్యాదు చేస్తాం. ఎప్పుడు 356 పెట్టాలో వాళ్ళకి తెలియదా?. చంద్రబాబుకి ముందు నిబద్ధత, క్రమశిక్షణ, కట్టుబాటు లేదు' అంటూ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు.