తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, ఆ పార్టీ నేత పట్టాభి ఇంటిపై దాడి విషయాన్ని టీడీపీ సీరియస్ గా తీసుకుంది. బుధవారం నాడు రాష్ట్ర బంద్ కు పిలుపునివ్వగా..పలుచోట్ల టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ లు చేశారు. మరికొన్ని చోట్ల నాయకులు, క్యాడర్ బయటకు వచ్చి ఆందోళనలకు దిగారు. అయితే పోలీసులు ఎక్కడికి అక్కడ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే టీడీపీ నేత చంద్రబాబునాయుడు దాడులకు నిరసనగా రేపటి నుంచి చంద్రబాబు నిరసన దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. ఈ అంశంపై పార్టీ నేతలతో చర్చించారు. రేపు ఉదయం 8 గంటల నుంచి 36 గంటల పాటు చంద్రబాబు దీక్ష కొనసాగే అవకాశం ఉంది.
శుక్రవారం రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు దీక్షకు దిగుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు దీక్షకు కూర్చోనున్నారు. దాడుల అంశంపై న్యాయ నిపుణులతో రెండు గంటల నుంచి చర్చలు జరిపారు. పార్టీ క్యాడర్ కు దగ్గరగా ఉండాలని నాయకులకు ఆదేశించారు. ఎటువంటి పరిస్థితి అయినా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని అంటు వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. ప్రభుత్వ అండతోనే ఇది అంతా సాగుతుందని ఆరోపిస్తున్నారు.