ఏపీ సీఎం జగన్ పై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. రాజధాని అమరావతిపై అభ్యంతరం ఉంటే ప్రతిపక్ష నేతగా జగన్ అప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఓట్ల కోసం అప్పుడు ప్రజలను మోసం చేసి..ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. తమకు నచ్చిన విధంగా చట్టాలు చేసే హక్కు ప్రభుత్వాలకు ఉండదని.ఏదైనా నిబంధనల ప్రకారమే ముందుకు సాగాలన్నారు. ప్రజలు ప్రాణాలు తీసే చట్టాలు చేస్తే కోర్టులు చూస్తూ ఊరుకోవన్నారు. కోర్టు తీర్పులపై ఇంతగా మాట్లాడిన సీఎంలు ఎవరూ లేరన్నారు. దమ్ముంటే రాజీనామా చేసి ప్రజా తీర్పు కోరాలన్నారు. అసెంబ్లీలో సీఎం జగన్ మాట్లాడిన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. మోసాలు, ఘోరాలు చేయడంలో వైసీపీ అధినేత దిట్టన్నారు.
అధికార వికేంద్రీకరణ కాదని, అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని సూచించారు. ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి సీఎం కావడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రానికి ఒక శని గ్రహంలా తయారయ్యారని, నమ్మక ద్రోహం చేసిన జగన్కు పాలించే హక్కు లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మళ్లీ మూడు ముక్కలాటకు సీఎం జగన్ తెరతీశారని చంద్రబాబు ఆరోపించారు. మూడు రాజధానుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదని ఆయన అన్నారు. విజయవాడ, గుంటూరు మధ్య పెడితే అభ్యంతరం లేదన్నారు. 33 వేల ఎకరాలు భూములను రైతులు ఇచ్చారని ఆయన తెలిపారు. మూడు రాజధానుల అంశం తరతరాలపై ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని జగన్‌పై చంద్రబాబు మండిపడ్డారు.